విద్యార్థుల భవిష్యత్తును తీర్చిద్దడం ద్వారా సమాజాభివృద్ధి లో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిద్దడం ద్వారా సమాజాభివృద్ధి లో ఉపాధ్యాయుల పాత్ర కీలకం
- తరతరాలకు ఉపాధ్యాయులను గౌరవించే సంప్రదాయం వర్ధిల్లాలి
- విద్యా బోధనలో ఉన్న తృప్తి మరే ఉద్యోగం లో లేదు
- రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తోంది
- జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా
- ఎంపీ లాడ్స్ నిధుల నుండి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం లోని ప్రతి పాఠశాలకు రెండు కంప్యూటర్లు ఏర్పాటు చేస్తాం
- ఉపాధ్యాయుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం
- కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు
- ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరిత
కర్నూలు, సెప్టెంబర్ 05 (పీపుల్స్ మోటివేషన్):-
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిద్దడం ద్వారా సమాజాభివృద్ధి లో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురు పూజోత్సవం-2025 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధ్యాపకునిగా జీవితాన్ని ప్రారంభించి, భారత రాష్ట్రపతిగా సేవలు అందించి, భారతరత్నగా కీర్తింపబడిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయులను గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో 1962 నుండి సెప్టెంబర్ 5 వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. తల్లి, తండ్రి తర్వాత గురువును పూజించే సంప్రదాయం అనాదిగా వస్తోందని, ఈ సంప్రదాయం తరతరాలకు వర్ధిల్లాలని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
జీవితకాలంలో రోజుకు సుమారు 8 గంటలు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలు, కళాశాలల్లో గడపడంవల్ల ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడుతుందని, ఇది ఇలాగే కొనసాగాలని కలెక్టర్ తెలిపారు.. విద్య మాత్రమే కాకుండా విలువలు, సమాజంలో ఎలా నడుచుకోవాలని నేర్పించడంలో ఉపాధ్యాయుల పాత్ర అపారమని కలెక్టర్ పేర్కొన్నారు..
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. పేదలందరికీ మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేస్తోందన్నారు.. బడి ఈడు పిల్లలందరినీ బడిలోనే చేర్పించాలనే అంశంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ముందుందన్నారు.. గత సంవత్సరం 5.15 లక్షల మంది విద్యార్థులు బడిలో ఉండగా, ఈ ఏడాది 5.22 లక్షల మంది విద్యార్థులు బడిలో ఉన్నారని తెలిపారు.. ఒకటవ తరగతిలో 7200 మంది విద్యార్థులు కొత్తగా ఎన్రోల్ అయ్యారని కలెక్టర్ తెలిపారు.
అలాగే 62 శాతం ఉన్న పదవ తరగతి ఉత్తీర్ణత ను సవాలుగా తీసుకొని కమిట్మెంట్ తో పనిచేసి సప్లిమెంటరీ ఉత్తీర్ణతతో 89 శాతం చేర్చడం ఉపాధ్యాయుల కృషిని కలెక్టర్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా పనిచేయాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. జిల్లాలో హిందీ టీచర్ల కొరత ఉన్నదని డీఈఓ తన దృష్టికి తీసుకురాగా వర్చువల్ విధానంలో డిజిటల్ క్లాసులను నిర్వహించి 99.5 శాతం హిందీ సబ్జెక్ట్ లో ఉత్తీర్ణత సాధించామని తెలిపారు. వీటితోపాటు ఇతర సబ్జెక్టులు, నైపుణ్యాభివృద్ధి, IAS ఫౌండేషన్ కోర్సులను కూడా వర్చువల్ విధానం ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు.. త్వరలో మరిన్ని అంశాలతో కొత్త వర్చువల్ స్టూడియోను కూడా ప్రారంభించనున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, ఆన్లైన్ తరగతులు తదితర వసతులు అందుబాటులో ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ సూచించారు.
విద్యా బోధనలో ఉన్న తృప్తి మరే ఉద్యోగం లో లేదని, తాను కూడా టీచర్ కావాలని సిల్వర్ జూబ్లీ కాలేజీలో బిఈడి చేశానని, తర్వాత మరో ఉద్యోగంలో చేరినందువల్ల టీచర్ కాలేకపోయానని, అయినప్పటికీ బోధన పట్ల ఉన్న మక్కువతో డిగ్రీ విద్యార్థులకు గణితం బోధించానని, ఏడాది పాటు డీఎస్సీ విద్యార్థులకు కోచింగ్ ఇచ్చానని కలెక్టర్ పేర్కొన్నారు..
ఎంపీ లాడ్స్ నిధుల నుండి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం లోని ప్రతి పాఠశాలకు రెండు కంప్యూటర్లు ఏర్పాటు చేస్తాం
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ఎంపీ లాడ్స్ నిధుల నుండి కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం లోని ప్రతి పాఠశాలకు రెండు కంప్యూటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నానని, ఉపాధ్యాయులు ఇచ్చిన స్ఫూర్తి,, క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య వల్ల తాను 45 ఏళ్లకే ఎంపి స్థాయికి చేరుకున్నానని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 15 ఏళ్ల కిందట తాను కాంట్రాక్ట్ లెక్చరర్ గా పని చేశానని, విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత కీలకమో తనకు తెలుసునని ఎంపీ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తూ విద్యారంగంలో ఎన్నో మార్పులు తెస్తున్నారని, ఢిల్లీకి వచ్చినపుడు కేంద్రమంత్రులతో, ఎంపీ లతో విద్యా వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, నైపుణ్యాల పెంపు, విద్యాభివృద్ధిపై చర్చించడం జరుగుతోందని ఎంపీ తెలిపారు. వెనుకబడిన కర్నూలు జిల్లాను విద్యా పరంగా మరింత అభివృద్ధి చేయడమే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు.. డీఎస్సీ లో జిల్లాకు రాష్ట్రంలోనే అత్యధికంగా దాదాపు 2700 టీచర్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతోందని తెలిపారు.. జిల్లా వాసి అయిన జిల్లా కలెక్టర్ కూడా జిల్లాను ఇరిగేషన్ పరంగా, విద్యాపరంగా అభివృద్ధి చేయడానికి నిత్యం మాతో చర్చిస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు.. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ఇదివరకే ముఖ్యమంత్రి తో ఈ అంశంపై చర్చించామని మంత్రి తెలిపారు.విద్యతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని, జిల్లాలో విద్యాభివృద్ధికి మరింత కృషి చేయాలని ఎంపీ ఉపాధ్యాయులను కోరారు.
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది
పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరితా రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని , ఉపాధ్యాయులు ఆదర్శప్రాయులు, మార్గదర్శకులు అని కొనియాడారు. మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ అని పెద్ద స్థానాన్ని గురువులకు ఇవ్వడం జరిగిందని, ప్రతి ఒక్కరూ గురువులను గౌరవించాలని సూచించారు. గురువులు నేర్పిన క్రమశిక్షణ, విద్యా బుద్ధుల వల్లనే మనం ఈ స్థానానికి చేరుకున్నామని గుర్తుంచుకోవాలన్నారు. మట్టిలోని మాణిక్యాల విద్యార్థులను వెలికి తీసేది ఉపాధ్యాయులేనని, శిలలను శిల్పాలుగా తీర్చిదిద్దే శిల్పుల లాంటి వారు ఉపాధ్యాయులు అని ఎమ్మెల్యే ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేశారని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని పథకాలకు మహనీయుల పేర్లు పెట్టామన్నారు. విద్యను ఎవరూ దొంగిలించలేరని, విద్యను అశ్రద్ద చేయవద్దని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు.
డిసిఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, 17వ వార్డు కార్పొరేటర్ పద్మలతారెడ్డి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతి, రాష్ట్ర బొందిలి వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధారానగర్ విక్రమ్ సింగ్, డిఇఓ శామ్యూల్ పాల్, జడ్పీ సీఈవో నాసర రెడ్డి సమాజంలో ఉపాధ్యాయుని పాత్ర కీలకం అని ప్రశంసిస్తూ ప్రసంగించారు..
అనంతరం 31 మంది ఉపాధ్యాయులకు 14 మంది ఇంటర్మీడియట్ విద్యకు అధ్యాపకులకు కలెక్టర్ ఎంపీ ఎమ్మెల్యేలు,ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా సన్మానం చేశారు.
కార్యక్రమం లో అధ్యాపకులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,తదితరులు పాల్గొన్నారు.

