రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

భారీ వర్షాలకు మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

భారీ వర్షాలకు మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

  • దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ వెంటనే పునరుద్ధరించాలి
  • పంటనష్టం అంచనా వేయండి
  • ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరదలపై సమీక్షలో సీఎం చంద్రబాబు


అమరావతి, అక్టోబరు 03:
ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ ను వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరద ప్రవాహాలపై ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరయ్యారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గొట్టా బ్యారేజి, తోటపల్లి బ్యారేజీ పరిధిలో భారీ ఎత్తున వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. గొట్టా బ్యారేజికి 1.89 లక్షల క్యూసెక్కులు, తోటపల్లికి 44 వేల క్యూసెక్కుల వరద వస్తోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్యమంత్రికి వివరించారు. ఒడిశాలోని వేర్వేరు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా వంశధార నదికి 1.05 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోందని తెలిపారు. భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా ముూడు జిల్లాల్లో నలుగురు మృతి చెందినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. విశాఖ నగరం కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో ఒకరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతానికి వర్షం లేదని... అయినా ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో ఆయా నదుల్లో వరద ఉందని అధికారులు సీఎంకు వివరించారు. వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్తును వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్దరణలో ఎక్కడా జాప్యం లేకుండా చూడాలని సీఎం సూచించారు. వరద కారణంగా నీట మునిగిన పంటను కూడా లెక్కించి పంట నష్టం అంచనాలను తయారు చేయాలన్నారు. అదే సమయంలో వర్షపు నీటిని సద్వినియోగం చేసుకునేందుకు గానూ రిజర్వాయర్లను నీటితో నింపాలని సూచించారు. ప్రజల ఇబ్బందులను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.


Comments

-Advertisement-