మైనర్ల డ్రైవింగ్‌పై ఉక్కుపాదం: 110 వాహనాలు స్వాధీనం, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్!
మైనర్ల డ్రైవింగ్‌పై ఉక్కుపాదం: 110 వాహనాలు స్వాధీనం, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్!
రోడ్డు భద్రతను, ప్రజల ప్రాణాలను కాపాడే ఉద్దేశంతో అన్నమయ్య జిల్లా పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ కఠిన ఆదేశాల మేరకు, మదనపల్లి సబ్ డివిజన్‌లో మైనర్ల డ్రైవింగ్‌పై గత మూడు రోజులుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
ఈ స్పెషల్ డ్రైవ్‌లో, మదనపల్లి డీఎస్పీ ఎస్.మహేంద్ర పర్యవేక్షణలో మొత్తం 110 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
18 సంవత్సరాల లోపు మైనర్లు ద్విచక్ర వాహనాలు నడపడం, రాష్ డ్రైవింగ్, స్టంట్స్ చేయడం వంటి సంఘటనలు ఇటీవల పెరిగాయి. వాహనాలలో సైలెన్సర్ ఆల్టరేషన్లు, బాడీ మాడిఫికేషన్లు వంటి అక్రమ మార్పులు చేసి, రోడ్లపై ప్రమాదకరంగా ప్రవర్తించడం రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోంది. ఈ నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగి, అమూల్యమైన ప్రాణనష్టం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న వాహనాలకు సంబంధించిన మైనర్లను, వారి తల్లిదండ్రులను డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి, డిఎస్పీ ఎస్.మహేంద్ర . ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రత్యేక కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ....
మైనర్ డ్రైవింగ్ చేయడం మోటార్ వెహికిల్స్ యాక్ట్ ప్రకారం నేరం. మైనర్ వాహనం నడిపితే, ఆ వాహన యజమానులైన తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి, భారీ జరిమానాలు విధిస్తారు.
అక్రమ ఆల్టరేషన్లు చేసిన వారిపై కూడా కేసులు నమోదవుతాయి.
బీమా చెల్లదు, ప్రమాదం జరిగితే పరిహారం పొందే అవకాశం ఉండదు. అనుభవం లేని రాష్ డ్రైవింగ్ వల్ల వాహనం నియంత్రణ తప్పి ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతాయి. మైనర్ల నిర్లక్ష్యం వల్ల డ్రైవర్ మాత్రమే కాకుండా, పాదచారులు, ఇతరులు కూడా బలవుతారు.
చిన్న వయసులో జరిగే ప్రమాదాలు శాశ్వత దివ్యాంగత్వానికి లేదా ప్రాణ నష్టానికి దారితీస్తాయి.
మైనర్లకు వాహనాలు ఇవ్వడం తల్లిదండ్రుల నిర్లక్ష్యంగా పరిగణించబడుతుంది.
పిల్లలు చట్టబద్ధమైన వయసు వచ్చేవరకు వాహనాలు ఇవ్వకుండా కఠిన పర్యవేక్షణ వహించాలి.
అన్నమయ్య జిల్లా ఎస్పీ కఠిన హెచ్చరిక!
ఈ సందర్భంగా మదనపల్లి పోలీసుల చర్యలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ అభినందించారు. అంతేకాకుండా, జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్‌పై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు. “మైనర్లు డ్రైవ్ చేస్తూ పట్టుబడితే, బండిని సీజ్ చేయడంతో పాటు, వారి పైన, వాహన యజమానులైన వారి తల్లిదండ్రుల పైన చట్ట ప్రకారం కఠినమైన కేసులు నమోదు చేయడం జరుగుతుంది” అని ఎస్పీ స్పష్టం చేశారు.
మైనర్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, స్టంట్స్ లేదా వాహనాల్లో అక్రమ మార్పులు గుర్తిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో మదనపల్లి వన్ టౌన్ సిఐ, రఫీ, ఎస్ఐలు అన్సర్ భాష, రహీముల్లా, ముదివేడు ఎస్ఐ, దిలీప్ కుమార్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
