పొదుపు పండుగ వేడుకలకు ప్రధాని రాక
పొదుపు పండుగ వేడుకలకు ప్రధాని రాక
- సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
- భారీ బహిరంగ సభకు బ్రహ్మండమైన ఏర్పాట్లు
- రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ప్రధాని
- శ్రీశైల దివ్యక్షేత్రంలో మహాదేవుణ్ణి దర్శించుకోనున్న ప్రధాని మోదీ
- ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నిరంతర పర్యవేక్షణ
- వారం రోజుల నుంచి కర్నూలులో మకాం వేసిన మంత్రులు
- కర్నూలు, నంద్యాల జిల్లాల్లో గురువారం ప్రధాని పర్యటన
అమరావతి, అక్టోబర్ 15: జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ధరల భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది. జీఎస్టీ సంస్కరణల నిర్ణయాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రచార కార్యక్రమాన్ని పండుగలా జరుపుతోంది. దసరా నుంచి దీపావళి వరకు సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరుతో ఈ ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రజలపై సుమారు రూ. 8 వేల కోట్ల మేర భారం తగ్గుతుందని ఓ అంచనా. ఈ క్రమంలో ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సమీపంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. అలాగే సభకు వచ్చే ముందు శ్రీశైలం దివ్యక్షేత్రానికి వెళ్లి జ్యోతిర్లింగ మూర్తి శివుణ్ణి, శక్తిపీఠంలో కొలువైన భ్రమరాంబిక దేవిని ప్రధాని మోదీ దర్శించుకుంటారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. 2024 ఎన్నికల తర్వాత అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కూటమి నేతృత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఏపీలో ప్రధాని విశాఖ, అమరావతి ప్రాంతాల్లో పర్యటించారు. గురువారం రాయలసీమ ప్రాంతంలో ప్రధాని పర్యటన జరగనుంది.
జీఎస్టీ సంస్కరణలపై భారీ ప్రచారం... సభకు భారీ ఏర్పాట్లు
జీఎస్టీ 2.0 నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ నుంచి భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈ ప్రచారంలో భాగమైంది. మండల స్థాయి మొదలుకుని జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున జీఎస్టీ సంస్కరణలపై కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించారు. అలాగే వివిధ విద్యా సంస్థల్లో కూడా జీఎస్టీ సంస్కరణలపై రకరకాల పోటీలు నిర్వహించారు. వినియోగదారులకు జీఎస్టీ సంస్కరణల వల్ల కలిగే లబ్దిని ఇంటింటికి తిరిగి వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా... కూటమికి చెందిన మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. యోగా డే సందర్భంగా ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రచారం చేపట్టిందో... ఇప్పుడు సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమాన్ని అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మండలాల వారీగా, జిల్లాల వారీగా జరుగుతున్న కార్యక్రమాల పర్యవేక్షణకు.. మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఓ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేసుకుని మరీ జీఎస్టీ సంస్కరణలపై ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కూటమికి చెందిన మూడు పార్టీలు చేపట్టాయి. ప్రస్తుతానికి 90 వేలకు పైగా ఈవెంట్లను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయిన క్రమంలో కర్నూలులో ప్రధాని హజరు కానున్న భారీ బహిరంగ సభను అంతే సక్సెస్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. వివిధ శాఖల సమన్వయంతో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా.. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం. గత 15 రోజుల నుంచి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు నిరంతరం కర్నూలు సభను మానిటర్ చేస్తున్నారు. సభకు వచ్చే వారికి భోజన సౌకర్యం మొదులుకుని... పార్కింగ్, సభలో సీటింగ్ ఏర్పాట్లు, మంచినీటి సరఫరా, తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా... అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాల నుంచి భారీ ఎత్తున ప్రజలు ఈ సభకు వస్తారని అంచనా. లక్షలాది సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున దానికి తగ్గ ఏర్పాట్లు, బందోబస్తు చేపట్టారు. సభకు వచ్చే వారికి ప్రయాణ సౌకర్యం కల్పించారు. అలాగే భారీ బందోబస్తు చేశారు. సుమారు 1800 మంది బలగాలతో ప్రధాని సభకు బందోబస్తు పెడుతున్నారు. ఇక ట్రాఫిక్ జాంలు కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు పెట్టారు.
ముఖ్యమంత్రి మానిటరింగ్... మంత్రుల మకాం
ఇక ప్రధాని పర్యటనను సూపర్ సక్సెస్ చేసేందుకు సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అలాగే జీఎస్టీ సంస్కరణలపై క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు శ్రీశైల క్షేత్రాన్ని ప్రధాని సందర్శిస్తుండటంతో ఆ దేవాలయంలో ఏర్పాట్లను.. ప్రధాని దృష్టికి తీసుకురావాల్సిన అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నారు. ఇక కర్నూలు జిల్లాలో మంత్రులు దాదాపు వారం రోజుల నుంచి మకాం వేశారు. సభ ఏర్పాట్లపై దగ్గరుండి పర్యవేక్షించారు. శాఖల వారీగా బాధ్యతలు పంచుకుంటూ.. సమిష్టిగా సభకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించుకుంటూ వారం రోజుల నుంచి కర్నూలులోనే ఉన్నారు మంత్రులు.
రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న ప్రధాని
కర్నూలు, నంద్యాల జిల్లాలో ప్రధాని పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారీ ఎత్తున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలను చేపట్టనున్నారు. మొత్తంగా రూ. 13,429 కోట్ల మేర అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. వీటిల్లో కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు ఉండగా.. ఓ రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నారు ప్రధాని. రూ. 9449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేస్తుండగా... రూ. 1704 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు. ఇక రూ. 2276 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నారు.
అభివృద్ధి కార్యక్రమాల వివరాలివి:
విద్యుత్ ట్రాన్సమిషన్ వ్యవస్థకు – శంకుస్థాపన – రూ. 2886 కోట్లు
ఓర్వకల్లు-కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ – శంకుస్థాపన - రూ. 4922 కోట్లు
కొత్త వలస - విజయనగరం మధ్య 4వ లైన్ – శంకుస్థాపన - రూ. 493 కోట్లు
పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ లైన్ – శంకుస్థాపన - రూ. 184 కోట్లు
సబ్బవరం-షీలానగర్ జాతీయ రహదారి -శంకుస్థాపన - రూ. 964 కోట్లు
రేణిగుంట - కడప - మదనపల్లె రోడ్డు ప్రారంభం - రూ. 82 కోట్లు
కడప – నెల్లూరు - చునియంపల్లి రోడ్లు ప్రారంభం – రూ. 286 కోట్లు
కనిగిరి బైపాస్ రోడ్ ప్రారంభం - రూ. 70 కోట్లు
గుడివాడ-నూజెండ్ల వద్ద 4-లేన్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జి ప్రారంభం – రూ. 98 కోట్లు
కల్యాణదుర్గం - రాయదుర్గం - మొలకలమూరు రోడ్డు ప్రారంభం – రూ. 13 కోట్లు
పీలేరు నుండి కలసూర్ సెక్షన్ వరకు నాలుగు లేన్ల రోడ్ ప్రారంభం - రూ. 593 కోట్లు
నిమ్మకూరులోని BELలో అడ్వాన్స్‌డ్ నైట్ విజన్ ప్రారంభం - రూ. 362 కోట్లు
చిత్తూరులోని ఇండేన్ బాట్లింగ్ ప్లాంట్ ప్రారంభం – రూ. 200 కోట్లు
కొత్తవలస –కొరాపుట్ రైల్వే డబ్లింగ్ పనులను జాతికి అంకితం – రూ. 546 కోట్లు
శ్రీకాకుళం- అంగుల్ నాచురల్ గ్యాస్ పైప్‌లైన్ జాతికి అంకితం - రూ. 1730 కోట్లు
ప్రధాని పర్యటన ఇలా..:
ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలు ఎయిర్ పోర్టుకు ప్రధాని చేరుకుని అక్కడి నుంచి శ్రీశైల దేవస్థానానికి చేరుకుంటారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం శ్రీశైలంలోని శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం ప్రధానమంత్రి మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో కర్నూలు సభకు చేరుకుని సభలో పాల్గొంటారు. అనంతరం ప్రధాని హెలీకాప్టర్ ద్వారా కర్నూలు ఎయిర్ పోర్టుకు చేరుకుని.. ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.