పంచాయతీ పరిపాలన వ్యవస్థలో సంస్కరణలు చేపట్టిన ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
పంచాయతీ పరిపాలన వ్యవస్థలో సంస్కరణలు చేపట్టిన ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
• పునర్వ్యవస్థీకరణతో మెరుగైన సేవలు అందించగలం
• 10వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తేజాన్నిచ్చారు
• ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ని కలిసి కృతజ్ఞతలు తెలియచేసిన ఏపీ పంచాయతీ సెక్రెటరీస్ అసోసియేషన్
ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి నాలుగు గ్రేడులుగా పంచాయతీలను వర్గీకరించడం శుభ పరిణామమని ఏపీ పంచాయతీ సెక్రెటరీస్ అసోసియేషన్ తెలిపింది. ఈ రోజు సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. పంచాయతీ పరిపాలన వ్యవస్థలో పునర్వ్యవస్థీకరణ చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ “గ్రామాల్లో చక్కటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. నాలుగు గ్రేడుల పంచాయతీల విధానం కచ్చితంగా గ్రామీణ ప్రజలకు మేలు చేస్తుంది. రూర్బన్ పంచాయతీలు గుర్తించినవాటిలో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తాము. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. స్థానిక సంస్థల పాలనలో పారదర్శకత తీసుకువచ్చేలా సంస్కరణలు తీసుకువచ్చాము. వీటిని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో సిబ్బంది పాత్ర కీలకం” అన్నారు.
పంచాయతీలను నాలుగు గ్రేడులుగా వర్గీకరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు కలుగుతుందని అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. 10 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పన చేపట్టడంతో అందరూ సంతోషంగా ఉన్నామని, మరింత ఉత్తేజంతో విధులు చేపడతామని వివరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేసిన పలు అంశాలపై ఉప ముఖ్యమంత్రివర్యులు స్పందించి. వాటిపై పరిశీలన చేసి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.