ఏటికొప్పాక బొమ్మలకు సాంకేతికత జత చేస్తాం
ఏటికొప్పాక బొమ్మలకు సాంకేతికత జత చేస్తాం
కదిలే బొమ్మల తయారీ కోసం పరిశోధనలు జరుగుతున్నాయి
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏటికొప్పాకపై ప్రత్యేక దృష్టి సారించారు
ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు ఏది చెప్పామో అంతకు మించి చేస్తున్నాం
ఏటికొప్పాకలో ఎమ్మెల్సీ కె. నాగబాబు పర్యటన
ఏటికొప్పాక బొమ్మలకు సాంకేతికత జత చేసి ప్రపంచ స్థాయికి ఈ కళను చాటి చెప్పే ప్రయత్నం కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతోందని, కదిలే బొమ్మల తయారీ కోసం పరిశోధనలు కూడా జరుగుతున్నాయని శాసన మండలి సభ్యులు కె. నాగబాబు స్పష్టం చేశారు. బుధవారం ఏటికొప్పాకలోని సొసైటీ భవనంలో యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాగబాబు పాల్గొని కళాకారులతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏటికొప్పాకపై ప్రత్యేక దృష్టి సారించారని, ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు ఏదైతే చెప్పామో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అంతకు మించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, అంచెలంచెలుగా అనుకున్నవన్నీ నెరవేరుస్తామన్నారు. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు అంకుడు కర్ర కోసం, విద్యుత్ సబ్సిడీ కోసం అడిగినది తమకు గుర్తున్నదని, అంకుడు కర్ర దాదాపుగా అందుబాటులోకి తీసుకు రాగలిగామని, విద్యుత్ సబ్సిడీ గురించి కూడా పరిశీలన జరుగుతోందని చెప్పారు. ఐకమత్యంతో కలిసికట్టుగా ఉంటే, సొసైటీ ద్వారానే ఇవన్నీ చేయడానికి సాధ్యం అవుతుందని వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి రూ. 25 లక్షలు ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయనున్నదని, ఏటికొప్పాక కళాకారులకు ఇది చాలా ఉపశమనం లాంటిదన్నారు. పెన్షన్ పొందడానికి అర్హులైన ప్రతి కళాకారుడికి, పెన్షన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. గతంలో ఉన్న సమస్యల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎలాంటి సమస్యలు పరిష్కారం అయ్యాయని నాగబాబు కళాకారులను అడగగా.. కూటమి ప్రభుత్వం వచ్చాక మాకు అన్ని బాగున్నాయని, మా తరంతోనే ఈ కళ ఆగిపోతుందేమో అని అనుకున్న తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి అందిస్తున్న సహకారంతో మా కళను భవిష్యత్తు తరాలకు కూడా అందజేయగలమనే నమ్మకం పెరిగిందని కళాకారులు వెల్లడించారు. కూటమి ప్రభుత్వంలోనే భారత మండపంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఏటికొప్పాక బొమ్మలు మొట్టమొదటగా ప్రదర్శించే అవకాశం కల్పించారని కళాకారులు సంతోషం వ్యక్తం చేశారు.
సొసైటీ హాల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 3 కోట్లు కేటాయించింది: యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయ కుమార్
ఏటికొప్పాక కళాకారుల కోసం సొసైటీ హాల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 3 కోట్లు కేటాయించిందని, రెండు నెలల్లో ఏటికొప్పాక బొమ్మ లాంటి సుందరమైన అధునాతన భవనం నిర్మిస్తామని యలమంచిలి శాసనసభ్యులు
సుందరపు విజయ కుమార్ వెల్లడించారు. కొత్తగా నిర్మాణమవుతున్న భోగాపురం విమానాశ్రయంలో ఏటికొప్పాక బొమ్మలు స్వాగతం పలికే విధంగా ప్రయత్నం చేస్తున్నామని, అటవీ శాఖ ద్వారా కర్రను తయారు చేసుకునే అవకాశం కల్పిస్తామని హామీనిచ్చారు. కళాకారుల సౌలభ్యం కోసం సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఏటికొప్పాక బొమ్మల తయారీ కళను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే విధంగా మార్గదర్శకాలు ఇస్తున్నారని, తదనుగుణంగా ఏటికొప్పాక కళాకారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పునరుద్ఘాటించారు.