రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మూడు కొత్త జిల్లాలకు గ్రీన్ సిగ్నల్

  • రాష్ట్రంలో 26 నుంచి 29కి పెరగనున్న జిల్లాల సంఖ్య
  • త్వరలో పోలవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటు
  • కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, నూతనంగా ఒక మండలం
  • ఇక నుంచి వాసవీ పెనుగొండ మండలంగా పేరుమార్పు
  • జిల్లాల పునర్విభజనపై మంత్రుల కమిటీ సిఫార్సుకు సీఎం చంద్రబాబు ఆమోదం
  • కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు- అనంతరం నోటిఫికేషన్


అమరావతి, నవంబరు 25:
రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదాన్ని తెలియచేశారు. మార్కాపురం, మదనపల్లె జిల్లాలు, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు సీఎం నిర్ణయించారు. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఈ మార్పు చేర్పులకు ఆమోదాన్ని తెలియచేశారు. ఈ నిర్ణయంతో మొత్తంగా రాష్ట్రంలో 29 జిల్లాలు ఏర్పడనున్నాయి. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు కూడా అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానపల్లె, శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా పెద్దహరివనం మండలాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

మూడు జిల్లాల భౌగోళిక స్వరూపం ఇలా

పోలవరం జిల్లా: రంపచోడవరం నియోజకవర్గంలోని రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం రెవెన్యూ డివిజన్ లో రంపచోడవరం, దేవీపట్నం, వైరామవరం, గుర్తేడు, అడ్డతీగల, గంగవరం, మారేడుమిల్లి, రాజవొమ్మంగి మండలాలు ఉండనున్నాయి. ఇక చింతూరు డివిజన్ లో యెటపాక, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలను చేర్చారు. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా ఏర్పాటయ్యే పోలవరం జిల్లాలో 3.49 లక్షల జనాభా ఉంది.

మార్కాపురం జిల్లా : యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లోని మార్కాపురం, కనిగిరి రెవెన్యూ డివిజన్లతో కొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పాటు కానుంది. మార్కాపురం రెవెన్యూ డివిజన్ లోని యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు,తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల మండలాలు, అలాగే కనిగిరి డివిజన్ లోని హనుమంతుని పాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, గిద్దలూరు, బేస్తవారిపేట, రాచర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు మండలాలు కొత్తజిల్లాల్లో ఉండనున్నాయి. మొత్తం 11.42 లక్షల జనాభాతో ఈ జిల్లా ఏర్పాటు కానుంది. 

మదనపల్లి జిల్లా: మదనపల్లి, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు నియోజకవర్గాల్లోని మదనపల్లె, పీలేరు రెవెన్యూ డివిజన్లతో కొత్తగా మదనపల్లి జిల్లా ఏర్పాటు కానుంది. మదనపల్లి రెవెన్యూ డివిజన్ లోని మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకల చెరువు, పెదమండ్యం, కురబలకోట, పీటీ సముద్రం, బీరొంగి కొత్తకోట, చౌడేపల్లె, పుంగనూరు మండలాలు, అలాగే పీలేరు డివిజన్ లోని సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, కంభంవారి పల్లె, కలికిరి, వాల్మీకిపురం మండలాలు ఉండనున్నాయి. మొత్తం 11.05 లక్షల జనాభాతో కొత్త జిల్లా ఏర్పడనుంది. 

రెవెన్యూ డివిజన్లలో మార్పు చేర్పులివీ

శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్‌లోని నందిగాం మండలాన్ని టెక్కలి డివిజన్ లో కలిపేందుకు మంత్రుల కమిటీ చేసిన సిఫార్సుకు ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలోని పాయకరావు పేట- యలమంచిలి నియోజకవర్గాల్లోని మండలాలతో కొత్తగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. కాకినాడ డివిజన్ లోని సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్ లో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం, మండలాలను రాజమహేంద్రవరం డివిజన్ లో కలపాలని నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ మండలాన్ని ఇక నుంచి వాసవీ పెనుగొండ మండలంగా పేరు మార్చనున్నారు. బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపనున్నారు. దీంతో పాటు అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లోని మండలాలను కలుపుతూ కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. ప్రస్తుతం కనిగిరి రెవెన్యూ డివిజన్ లో ఉన్న మర్రిపూడి, పొన్నలూరు మండలాలను కందుకూరు రెవెన్యూ డివిజన్ లో కలపనున్నారు. కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, రాపూర్, సైదాపురంలను తిరుపతి జిల్లా గూడురు డివిజన్ లో విలీనం చేయనున్నారు. పలమనేరు డివిజన్‌లోని బంగారుపాళ్యంను చిత్తూరు డివిజన్ లో కలుపనున్నారు. సదుం, సోమల, పీలేరు, గుర్రం కొండ, కలకడ, కేబీ పల్లి, కలికిరి, వాల్మీకి పురం మండలాలతో పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. పలమనేరు డివిజన్‌లోని చౌడేపల్లి, పుంగనూరు మండలాలను మదనపల్లి రెవెన్యూ డివిజన్ లో విలీనం చేయనున్నారు. కడప జిల్లాలోని ఒంటిమిట్ట, సిద్ధవటంలను రాజంపేట రెవెన్యూ డివిజన్ లో కలపనున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిరను కొత్త రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయనున్నారు. కదిరి డివిజన్ లోని ఆమడగూరు మండలాన్ని పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ లో విలీనం చేయనున్నారు. పుట్టపర్తి డివిజన్ లో ఉన్న గోరంట్ల మండలాన్ని పెనుకొండ డివిజన్ లో కలపనున్నారు. నంద్యాల జిల్లా డోన్ రెవన్యూ డివిజన్ లోని బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల నంద్యాల డివిజన్ లోని సంజామల, కొలిమిగుండ్ల మండలాలతో కొత్తగా బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది.  

 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులూ లేవు

మంత్రుల కమిటీ సిఫార్సులతో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లతో ప్రస్తుతం ఉన్న 17 జిల్లాల్లో మార్పు చేర్పులు చోటు చేసుకున్నాయి. మిగతా 9 జిల్లాలు విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పలనాడు, అనంతపురం జిల్లాల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. మంత్రుల కమిటీ చేసిన ఈ ప్రతిపాదనలు వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. మంత్రివర్గం ఆమోదం అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల మార్పు చేర్పులపై అధికారిక నోటిఫికేషన విడుదల కానుంది.

Comments

-Advertisement-