ప్రతి పల్లెకు సదుపాయం... ప్రతి ఇంటికి సౌభాగ్యం
ప్రతి పల్లెకు సదుపాయం... ప్రతి ఇంటికి సౌభాగ్యం
- రూ. 6787 కోట్ల అంచనా వ్యయంతో పల్లె పండగ 2.0
- గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా పనులకు శ్రీకారం
- రూ. 5,838 కోట్ల అంచనాతో 8,571 కిలోమీటర్ల కొత్త రహదారులు, రూ.375 కోట్లతో 25 వేల మినీ గోకులాలు
- రూ. 4 కోట్ల వ్యయంతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు
- ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నేతల బూతులు, బుద్ధులు మారడం లేదు
- మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది
- అబద్ధపు హామీలతో జెన్ జి యువతను మోసం చేయలేం
- సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుంది
- రాజోలు నియోజక వర్గం శివకోడు గ్రామంలో పల్లె పండగ 2.0 కార్యక్రమం ప్రారంభంలో ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్
‘రాష్ట్రంలోని గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో 'పల్లె పండగ 2.0' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘ప్రతి పల్లెకు సదుపాయం... ప్రతి కుటుంబానికి సౌభాగ్యం’ లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 4 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించినట్లే, పల్లె పండగ 2.0లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. పల్లె పండగ 2.0 కార్యక్రమం ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి గ్రామాన్ని ఒక అభివృద్ధి చిహ్నంగా తీర్చిదిద్దే సంకల్పంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామని అన్నారు. బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం శివకోడులో పల్లె పండగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్లె పండగ తొలి దశకు సంబంధించి చేపట్టిన పనులు ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా తిలకించారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పల్లెల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా రూపొందించిన అద్భుత కార్యక్రమం పల్లె పండగ. గ్రామీణాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈ కార్యక్రమం గొప్ప మైలురాయిగా నిలిచిపోతుంది. ప్రజల సహకారంతో ప్రణాళికబద్దంగా ముందడుగు వేసి గొప్ప విజయం సాధించాం.
• పల్లె పండగ 2.0 ద్వారా రెండింతల అభివృద్ధి
పల్లె పండగ విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ పల్లె పండగ 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పల్లె పండగ 1.0 కార్యక్రమం ద్వారా రూ. 2,525 కోట్ల విలువైన పనులు టైం బౌండ్ విధానంలో పూర్తి చేశాం. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం. పాడి రైతుల కోసం 22,500 మినీ గోకులాలు ఏర్పాటు చేశాం. మూగజీవాల దప్పిక తీర్చడానికి 15 వేల నీటి తొట్టెలు నిర్మించాం. లక్షకు పైగా నీటి కుంటలు ఏర్పాటు చేశాం. ఇప్పుడు పల్లె పండగ 2.0 కార్యక్రమం ద్వారా రూ. 5,838 కోట్ల అంచనా వ్యయంతో 8,571 కిలోమీటర్ల కొత్త రహదారులు నిర్మిస్తున్నాం. పాత రహదారులకు పునర్నిర్మాణం చేయబోతున్నాం. రూ. 375 కోట్ల వ్యయంతో 25 వేల మినీ గోకులాలు, రూ. 16 కోట్ల అంచనాతో 157 కమ్యూనిటీ గోకులాలు ఏర్పాటు చేస్తాం. రూ. 4 కోట్ల వ్యయంతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశాం. పంచాయతీల పరిధిలో రూ. 406 కోట్లతో 15 వేల కొత్త అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. రూ.148 కోట్లతో డీపీఆర్సీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం చేయనున్నాం. వీటితోపాటు కోనసీమకు అదనంగా మరో రూ.100 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నాం. వీటన్నింటికి నాబార్డు, ఏషియన్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ బ్యాంకుల నుంచి రుణ సహకారం తీసుకోవడంతో పాటు మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, సాస్కీ వంటి పథకాల నుంచి నిధులు సేకరిస్తున్నాం.
• అప్పులు, సమస్యలు వారసత్వంగా వచ్చాయి
గత ఐదేళ్ల వైసీపీ పాలనను ఒకసారి గుర్తు చేసుకుంటే గుంతలుపడ్డ రోడ్లు, మరమ్మతులు నోచుకోని కాలువలు, పాలనపై ప్రశ్నిస్తే పెట్టిన అక్రమ కేసులు గుర్తుకొస్తాయి. గత ప్రభుత్వం నుంచి మన ప్రభుత్వానికి వారసత్వంగా ఏదైనా వచ్చింది అంటే అవి అప్పులు, సమస్యలు మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో నాయకుల దగ్గరకు వెళ్లి ఇది చేయండి అని అడిగే పరిస్థితి ఉండేది కాదు. మార్పు కావాలని యువత బలంగా తీసుకున్న నిర్ణయంతో ఈ రోజు ప్రభుత్వం మారిపోయింది. అభివృద్ధి పనులకు వేల కోట్లు ఖర్చు చేయగలుగుతున్నాం.
- గత ప్రభుత్వంలా దోచుకోవడం లేదు
గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే కొన్ని పత్రికలు కూటమి ప్రభుత్వం 18 నెలల కాలంలో ఏం చేసిందని మాట్లాడుతున్నాయి.. వాటికి మేము ఒకటే చెబుతున్నాం. గత ప్రభుత్వంలా మేము దోచుకోవడం లేదు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం లేదు. సంక్షేమం పేరుతో అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం లేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నాం. అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పెన్షన్లు మీకంటే బలంగా ఇస్తున్నాం. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక తరహాలో ఇక్కడ విప్లవాలు వస్తాయని కొంతమంది నాయకులు కలలు కంటున్నారు. గత ప్రభుత్వం ఇంకో ఏడాది అధికారంలో ఉంటే అలాగే జరిగేది. కానీ అదృష్టవశాత్తు ఎలాంటి గొడవలు లేకుండానే ఓటు అనే ఆయుధంతో యువత ప్రభుత్వాన్నే మార్చేశారు.
• వాళ్లు రావడం అసాధ్యం
ప్రజా క్షేత్రంలో ఓటు అనే ఆయుధంతో ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదు. వాళ్ల బూతులు మారడం లేదు. వాళ్ల బుద్ధి మారడం లేదు. 2029లో మళ్లీ మేమే వస్తాం. అంతు తేలుస్తాం. అని సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. వైసీపీ నాయకుల తీరుపై పిఠాపురంలో ఒకసారి మాట్లాడాను. మరోసారి చెబుతున్నాను.. నోరుంది కదా అని ఇష్టానుసారం పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. 2029లో మళ్లీ మేము వస్తామని కలలుకంటున్న వైసీపీ బ్యాచ్ కు రాజోలు గడ్డ నుంచి ఒకటే చెబుతున్నాం... మీరు రారు. అలాంటి ఆశలు పెట్టుకోకండి. అవి జరగవు. రాష్ట్రంలో మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. కోనసీమ ప్రాంతంలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకులా చూసుకుంటారు. కూటమి ప్రభుత్వాన్ని మీరు పెద్ద కొడుకులా కాపాడితే ... ఆ పెద్ద కొడుకే మీకు భవిష్యత్తు ఇస్తాడు.
• నవ భారతాన్ని నిర్మిద్దాం
“జెన్ జి” యువత ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. అబద్దపు హామీలుతో వారిని మోసం చేయలేము. బీహార్ ఎన్నికల్లో లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపినా ఆర్జేడిని ఓడించారు. మునుపటి తరంతో పోల్చుకుంటే జెన్ జి యువత చాలా భిన్నం. సంక్షేమ పథకాలతో ప్రభుత్వాన్ని నడిపిస్తామంటే కుదరదు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని చేసి చూపించాలి. ఉపాధి కల్పించాలి. సంక్షేమ పథకాలు తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగైతేనే నిజమైన అభివృద్ధి. ఎక్కువ శాతం ప్రజలు సంక్షేమం అవసరం లేని పరిస్థితిలో ఉండాలి. వాళ్ల స్వయం శక్తి మీద నిలబడే పాలసీలు తీసుకురావాలి. ఆ దిశగానే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిధులు లేకపోయినా, ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తున్నాం. పల్లెల రూపురేఖలు మారుస్తున్నాం. సగటు మనిషి కోరుకుంటున్న అభివృద్ధి దిశగా ఆలోచన చేస్తున్నాం. సంపద సృష్టించగలిగితే రాష్ట్రం నుంచి వలసలు వెళ్లే అవసరం ఉండదు. నేను కోరుకుంటున్నది స్వయం శక్తి మీద నిలబడే భారతదేశం కావాలి. ఎవరికి తలవంచని యువ భారతం కోరుకుంటున్నాను.
• కోనసీమకు కేరళ స్థాయి శక్తి ఉంది
పర్యటకంలో కోనసీమ.. కేరళ స్థాయి శక్తి, సత్తా ఉన్న ప్రాంతం. ఇక్కడ బ్యాక్ వాటర్ తో కేరళ తరహా టూరిజాన్ని అభివృద్ధి చేయవచ్చు. మన దర్శక, నిర్మాతలు షూటింగులకు ఎక్కడో తమిళనాడు, కేరళకు వెళ్తుంటారు. కోనసీమ అందాలు అంతకు మించి ఉంటాయి. ఈ అందాన్ని మాటల్లో వర్ణించలేము. ఇక్కడి యువతలో ఎంతో తెగింపు ఉంటుంది. వీటన్నింటిని సరైన మార్గంలో పెడితే వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చు. గత ప్రభుత్వం యువతకు ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టారు. ఒక పద్దతి పాడు లేకుండా ఉద్యోగాలు కల్పించి వారి జీవితాలను నాశనం చేశారు. యువత శల్య పరీక్షలు చేస్తేనే రాజకీయ నాయకులు బాధ్యతగా ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , నేను సాక్షాత్తూ శాసనసభలోనే చెప్పాము. మేము తప్పు చేసినా మాకు శిక్ష పడాల్సిదే అని మాట్లాడాం. కూటమి గెలుపునకు ఓట్లు వేసిన మీరందరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది.
• బాధ్యతతోనే ప్రశ్నించే హక్కు వస్తుంది
సమాజం పట్ల... దేశం పట్ల... మన సంస్కృతి పట్ల బాధ్యతగా ఉంటేనే ఎవరికైనా ప్రశ్నించే హక్కు వస్తుంది. రాజ్యాంగ దినోత్సవం నాడు ఒకటే సందేశం ఇస్తున్నాను. యువత సమాజం పట్ల బాధ్యతగా నిలబడితేనే రాజకీయ నాయకులను నిలదీసే హక్కు ఉంటుంది. ప్రజాస్వామాన్ని గౌరవించని నాయకులను ఉపేక్షించను. అది జనసేన నాయకులైనా సరే. అవసరమైతే వాళ్లను వదులుకుంటాను తప్ప విలువలను వదులుకోను“ అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి, సానా సతీష్ బాబు, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, శాసనసభ సభ్యులు దేవ వరప్రసాద్, అయితాబత్తుల ఆనంద రావు, గిడ్డి సత్యనారాయణ, బండారు సత్యానందరావు, శాసనమండలి సభ్యులు పేరాబత్తుల రాజశేఖర్, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, రాజోలు ఎంపీపీ శ్రీదుర్గ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ నిశాంతి తదితరులు పాల్గొన్నారు.

