హైడ్రా కార్యక్రమాలకు ప్రజల నీరాజనం
హైడ్రా కార్యక్రమాలకు ప్రజల నీరాజనం
- దుష్ప్రచారాన్ని తిప్పికొడుతున్న కాలనీ, బస్తీవాసులు
- హైడ్రా రక్షణ చర్యలకు ప్రజల ఘనాభినందనలు
హైదరాబాద్, నవంబర్ 6 ( పీపుల్స్ మోటివేషన్): నగరంలోని ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించేందుకు రూపుదిద్దుకున్న హైడ్రా కార్యక్రమానికి కాలనీ, బస్తీ ప్రజలు విస్తృత మద్దతు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ, నగర ప్రజలు ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైడ్రా వల్ల నగరానికి కలిగిన లాభాలను, ప్రజలకు అందిన సేవలను ప్లకార్డుల ద్వారా తెలియజేస్తూ మద్దతు తెలుపుతున్నారు. మంగళవారం అంబర్‌పేటలో బతుకమ్మ కుంట వద్ద వాకింగ్ చేసిన ప్రజలు హైడ్రా పనులను కొనియాడగా, బుధవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని మరిచెట్టు వద్ద దాదాపు 15 కాలనీల ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. మణికొండలోనే రూ. వందల కోట్ల విలువైన పార్కులను కాపాడి నగర ప్రజలకు పచ్చదనాన్ని అందించిన హైడ్రా చర్యలను ప్రశంసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. నెక్నాంపూర్ విలేజ్, తిరుమల హిల్స్ నివాసులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఖాజాగూడ ప్రశాంతి హిల్స్‌లో హైడ్రా రక్షించిన పార్కుల్లో మొక్కలు నాటారు. కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్స్ కాలనీకి చెందిన 4,300 గజాల ప్రజావసరాల స్థలాన్ని కాపాడినందుకు ప్రజలు ర్యాలీ నిర్వహించారు. అదే కాలనీలో 2,000 గజాల పార్కును రక్షించినందుకు అభినందన సభ కూడా ఏర్పాటు చేశారు.
- హైడ్రా రక్షణ చర్యలకు ప్రజల ఘనాభినందనలు
“ఒక్కొక్కరి స్వార్థం కోసం వందల మంది నష్టపోవాలా?” అనే ప్రశ్నలతో నినాదాలు గళమెత్తాయి. హైడ్రా లేకపోతే ఈ పార్కులు, చెరువులు కాపాడేవారు ఎవరూ కాదని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇటీవల భారీ వర్షాలు కురిసినా, నగరంలో వరద ఇబ్బందులు రాకుండా హైడ్రా చేపట్టిన నాలా శుభ్రీకరణ, పూడికతీత చర్యలు ఫలించాయని గుర్తు చేశారు. వానల్లో రహదారులపై నిలబడి ప్రజలకు అండగా నిలిచిన హైడ్రా టీమ్ అవసరమని, నగరం కోసం హైడ్రా కొనసాగాలని ప్లకార్డులు పేర్కొన్నాయి.
- దుష్ప్రచారం ఆపాలని విజ్ఞప్తి
హైడ్రా పై ఆధారంలేని ఆరోపణలు చేయడం తగదని, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజా మద్దతును తగ్గించే ప్రయత్నాలు చేస్తే అంగీకరించబోమని కాలనీవాసులు హెచ్చరించారు. చాంద్రాయణగుట్టలో హైడ్రా కూల్చివేతలు చేపట్టలేదని, రహదారి విస్తరణలో GHMC తొలగించిన భవనాలను హైడ్రాపై నెట్టడం తప్పుదారి పట్టించే ప్రచారమని ప్రజలు స్పష్టం చేశారు. నగర సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాలనే హైడ్రా ఆత్మను కాపాడాలని, దశాబ్దాల సమస్యలను గంటల్లో పరిష్కరించే ఈ సేవా వ్యవస్థకు ప్రజలు అండగా ఉంటామని తెలిపారు.
