అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ప్రతిష్ఠను చాటిన సీతక్క
అంతర్జాతీయ వేదికపై తెలంగాణ ప్రతిష్ఠను చాటిన సీతక్క
అంస్టర్‌డామ్, నవంబర్ 5 (పీపుల్స్ మోటివేషన్ ): నెదర్లాండ్స్‌లో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రసంగం అంతర్జాతీయ వేదికను అలరించింది. “ప్రతికూలతలనుంచి మహిళా సాధికారత దిశగా” అనే అంశంపై ఆమె చేసిన సమర్థవంతమైన ప్రసంగం ప్రపంచ నాయకులను ఆకట్టుకుంది. సభలో పలువురు ప్రతినిధులు నిలబడి చప్పట్లు కొడుతూ ఆమెను అభినందించారు.
సమ్మిట్ వేదికపై సీతక్క తన జీవన ప్రయాణాన్ని హృదయానికి హత్తుకునేలా వివరించారు. ఆదివాసీ బాలికగా ప్రారంభమైన తన జీవితం, ప్రజాసేవకురాలిగా చేసిన పోరాటాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేసిన త్యాగాలు, కరోనా సమయంలో ప్రజలకు అందించిన సాయంపై ఆమె మాట్లాడారు. సవాళ్లను జయిస్తూ, ప్రజల కోసం నాయకత్వం వహించే శక్తి మహిళల్లో అపారం ఉందని ఆమె పేర్కొన్నారు. సీతక్క తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రదర్శిస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను ఇచ్చారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామీణాభివృద్ధి చర్యలు, సంక్షేమ పథకాల ప్రభావం, గ్రామీణ మహిళల్లో ఆర్థిక స్వావలంబన పెంపు వంటి అంశాలను ప్రపంచ వేదికపై ఆమె వివరించారు. తెలంగాణ “ప్రజల ప్రభుత్వం”గా, సామాజిక న్యాయం మరియు సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు సీతక్క ప్రసంగాన్ని ప్రశంసిస్తూ, మహిళా నేతృత్వం, గ్రామీణాభివృద్ధి, సంక్షేమ పరిపాలనలో తెలంగాణ మోడల్ ప్రేరణాత్మకమని అభిప్రాయపడ్డారు.
