తెలుగు జాతి ప్రగతికి పునాది వేసిన మహామనిషి ఆచార్య ఎన్జీ రంగా
తెలుగు జాతి ప్రగతికి పునాది వేసిన మహామనిషి ఆచార్య ఎన్జీ రంగా
- ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఘన నివాళులు
ఆధునిక భారతదేశ శాస్త్రవిజ్ఞాన రంగాలకు దారి చూపించిన మహోన్నత మేధావి, రైతు సంక్షేమం కోసం జీవితాంతం పోరాటం చేసిన వెలుగుదిక్సూచి, స్వాతంత్య్ర సమరయోధుడు, తెలుగు జాతి గర్వకారణం పద్మ విభూషణ్ ఆచార్య యన్.జి. రంగా 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘనంగా నివాళులు అర్పించారు. ఆచార్య రంగా మేధస్సు, పరిశోధన, సేవాస్పూర్తి, ప్రజాసంకల్పం నేటి తరాలకు శాశ్వత ప్రేరణ అని మంత్రి గుర్తుచేశారు. రైతుల హక్కుల కోసం రాజీ పడకుండా పోరాడిన గొప్ప నాయకుడైన రంగా మార్గం అనుసరించాల్సిన ధర్మమని పేర్కొన్నారు. శాస్త్రీయ దృష్టి, సాంకేతికత, ఆధునిక వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి అనే విలువలతో నిండిన ఆయన ఆలోచనలు ఇప్పటికీ భారతదేశానికి మార్గదర్శకాలు అని మంత్రి అన్నారు. ఆచార్య రంగా ఆశయాలందే రాష్ట్రంలో రైతు సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న ఆధునిక పథకాలు ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అన్యాయానికి ఎదురు నిలిచి రైతును రక్షించే ధైర్యం, సత్యానికి కట్టుబాటు, దేశాభివృద్ధి పట్ల అంకితభావం రంగా నిజమైన వారసత్వమని పేర్కొన్నారు. రైతు, గ్రామం, దేశం అనే మూడు విలువలకు ప్రాణం పెట్టిన రంగా యుగప్రవర్తక సేవలను స్మరించుకుంటూ, ఆయనకు శతశత నమస్కారాలు చెప్పుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
