రాష్ట్రంలోని పత్తి రైతులకు పూర్తి భరోసా
రాష్ట్రంలోని పత్తి రైతులకు పూర్తి భరోసా
సీసీఐ నిబంధనల సడలింపులపై కేంద్రంతో చర్చలు వేగవంతం
పేరేచెర్ల, సత్తెనపల్లి సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, రైతుల సమస్యలు తెలుసుకున్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
గుంటూరు & పల్నాడు జిల్లాలు, నవంబర్ 25: రాష్ట్రంలోని పత్తి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హమీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పత్తి రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ మంత్రి మంగళవారం పేరేచెర్ల, సత్తెనపల్లి లోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను స్వయంగా సందర్శించి, రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. పత్తి తేమశాతం నమోదుతో పాటు, కొనుగోలు విధానం, యాప్ సమస్యలు, L1 నుండి L4 గ్రేడింగ్ సమస్యలపై వివరంగా పరిశీలించారు. రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చేస్తామని రైతులకు హమీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. ప్రతి కిలో పత్తి కొనుగోలు అయ్యేలా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది అని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం పత్తి రైతులకు పలు కష్టాలు వర్షాలు, దిగుబడి తగ్గడం, సీసీఐ కఠిన నిబంధనలు రూపంలో వచ్చాయని తెలిపారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో 5 లక్షల 40 వేల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. దాదాపు 8 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ అకస్మాత్తుగా కురిసిన వర్షాల వల్ల పత్తి నాణ్యత దెబ్బతింది. దిగుబడి తగ్గిన రైతులకు పైగా సీసీఐ అనేక కఠిన నిబంధనలు పెట్టడం వల్ల తీవ్ర ఇబ్బందులు పెరిగాయి. ముఖ్యంగా కొత్తగా అమలు చేస్తున్న L1, L2, L3, L4 గ్రేడింగ్ విధానం రైతులకు పెద్ద భారమవుతోంది. పంటే నష్టపోయింది… దానిపై ఇంకా నిబంధనలు పెట్టడం సరైంది కాదు. రైతులకు అన్యాయం జరగకుండా అన్ని నియమాలను పునఃసమీక్షించాలని కొద్ది రోజుల క్రితమే కేంద్రాన్ని కోరామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వంతో చర్చలు, డిసెంబర్ 1 నుండి అదనపు కొనుగోలు కేంద్రాలు
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి మంత్రి అచ్చెన్నాయుడు ఫోన్ లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పూర్తిగా వివరించారు. కేంద్ర టెక్స్టైల్స్ మంత్రి, సీసీఐ చైర్మన్, ఎండీతో నేరుగా మాట్లాడి పత్తి కొనుగోలు నిబంధనల సడలింపులు చేయాలని కోరినట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్రమంత్రి స్థాయిలో మాట్లాడి, ఒకసారి ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటించిన తర్వాత రైతుకు కొత్త నిబంధనలు పెట్టే అవకాశం ఉండకూడదు అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం ఉన్న మిల్లులతో పాటు అదనంగా మరిన్ని మిల్లులు తక్షణం ఓపెన్ చేయండి అని సీసీఐ ఎండీకి కేంద్ర మంత్రి రామ్మోహన్ కోరడంతో కొనుగోలు వేగవంతానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని, ప్రతిస్పందనగా సీసీఐ ఎండీ నుంచి డిసెంబర్ 1 నుంచి అన్ని మిల్లులు పూర్తిగా ఓపెన్ చేస్తాం అన్న హామీ ఇచ్చటినట్లు తెలిపారు. పేరేచెర్ల సెంటర్‌లో ఒక మిల్ అదనంగా, సత్తెనపల్లిలో అన్ని మిల్లులు పూర్తిగా ఓపెన్ కానున్నాయని వెల్లడించారు. ఈ సంవత్సరం తడిసిన పత్తి కారణంగా తేమ శాతం పెరగడంతో, 12% నుండి 18% వరకు తేమ ఉన్న పత్తిని కూడా సీసీఐ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ప్రతి రైతుకి న్యాయం జరుగుతుందనే పూర్తి హామీ ఇచ్చారు. పత్తి విక్రయం కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా అన్ని శాఖలతో సమన్వయం చేస్తున్నారు. రైతులు కూడా నాణ్యమైన పంటలు పండించాలి, డిమాండ్ ఉన్న పంటల వైపు ముందుగా ప్రణాళికతో వెళ్లాలి అని సూచించారు.
రైతుల అభివృద్ధే లక్ష్యం... జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు
బడ్జెట్ లో మద్ధతు ధరల కోసం 300 కోట్లు కేటాయించామని, కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో 1000 కోట్ల మద్దతు ధరల కోసం ఖర్చు చేసామని విషయాన్ని పులివెందుల ఎమ్మెల్యే జగన్ గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఇప్పటికైనా జగన్ పోలిటికల్ డ్రామాలు ఆపాలని హితవు పలికారు. జగన్ చేసే పిచ్చి పనులకు, మాట్లాడే పిచ్చి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మరని, ఆయన దుకాణం సర్దే టైం దగ్గర పడిందని ఎద్దేవా చేశారు. గతంలో రైతులకు మద్ధతుగా కోకో, మామిడి,పొగాకు,ఉల్లి, టమోటా, పంటలకు మద్ధతు ధరను అందించి రైతన్నలను ఆదుకున్నామన్న విషయాన్ని జగన్ పదే పదే గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అరటి, మొక్కజొన్న, పత్తి రైతులందరికీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో నరసరావుపేట ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్, మక్కిన మల్లికార్జున రావు , మార్కెటింగ్ డైరెక్టర్ విజయ సునీత, మార్కెట్ కమిటీ అధ్యక్షులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.
