రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు
రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా ధాన్యం కొనుగోళ్లు
• నేటి వరకు 2,36,284 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
• గత ఏడాదితో పోలిస్తే 30 శాతం అదనం
• 560 కోట్ల 48 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ
- రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా 32,793 మంది రైతుల నుండి 2,36,284 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసి దాదాపు రూ. 560 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
విజయవాడ రూరల్ లోని కానూరు సివిల్ సప్లైస్ భవన్ లో మంగళవారం ధాన్యం కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులు మాపై ఉంచిన నమ్మకం, భరోసా తో నిజాయితీగా, పారదర్శకంగా ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. రైతులు ఆశించిన మేరకు క్షేత్ర స్థాయిలో దాదాపు 16,000 మంది సిబ్బంది ఇందుకు కృషి చేస్తూ జిల్లా స్థాయిలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు నిరంతరం కొనగోళ్ల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. దీనిలో భాగంగా నేటి వరకు 32,793 మంది రైతుల నుండి 2,36,284 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసి రూ. 560 కోట్ల 40 లక్షలు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఇది గత సంవత్సరంతో పోల్చితే 30% అదనంగా పెరిగిందన్నారు. గత ఏడాది ఇదే రోజున 1,81,885 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. తమ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా క్షేత్ర స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ నిర్వహిస్తూ రైతాంగానికి కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో కొంతమంది రైతులకి కొన్ని ప్రాంతాల్లో రైస్ మిల్లర్లకు లబ్ధి చేకూర్చేలా గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహకాలు అందరికే తెలిసిందేనన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఇప్పటివరకు ధాన్యం అమ్మిన రైతుల సంఖ్య 36% కు పెరిగిందన్నారు. వీరిలో ఎక్కువగా చిన్న సన్నకారు రైతులు ఉన్నారని దాదాపు 6,600 మంది కౌలు రైతులు కూడా సద్వినియోగం చేసుకోగలిగారన్నారు.
గత సంవత్సరం సుమారు రూ. 12 వేల కోట్ల దాకా ధాన్యం కొనుగోలు చేసినప్పుడు 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చెప్పిన మాట నెరవేర్చుతూ రైతుల ఖాతాల్లో నగదు చెల్లిస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమన్నారు. ఈసారి ఒక ఛాలెంజ్ గా రైతులకు నగదు చెల్లింపుల విషయాన్ని సవాల్ గా తీసుకుని 48 గంటలు కాస్తా 24 గంటలకే రైతుల ఖాతాలో నగదు జమ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు రూ. 560 కోట్ల 48 లక్షల మంది రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే జమ చేయడం జరిగిందన్నారు. దీనికొక ఉదాహరణగా గుంటూరు మండలంలోని పత్తిపాటి సుబ్బారావు అనే రైతు ఆయన ఖాతాలోకి రూ. 2 లక్షల 8 వేల ను 6 గంటల్లోనే జమ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా ఏలూరు జిల్లా భీమడోలు లో నీలం త్రిమూర్తులు అనే రైతు ఖాతాలోకి 5 గంటల్లోనే జమ చేయడం జరిగిందన్నారు. గోనె సంచుల సమస్య లేకుండా 6 కోట్ల 34 లక్షల గోతాలను రైతు సహాయ కేంద్రాల్లో రైతాంగానికి అందుబాటులో ఉంచామన్నారు. ప్రతి వాహనానికి జిపిఎస్ డివైస్ ఏర్పాటు చేసి పూర్తి పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో అల్పపీడన తుఫాన్ హెచ్చిరికల నేపధ్యంలో 50 వేల టార్పాలిన్ లు ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో జిల్లా స్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు. అందులో భాగంగా ఇప్పటివరకు సుమారు 19 వేల టార్పాలిన్ లు రైతు సహాయ కేంద్రాల్లో రైతాంగానికి ఉచితంగా అందించడం జరిగిందన్నారు. దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా రైతాంగానికి వాళ్ళు ధాన్యాన్ని ఎక్కడ, ఏ టైమ్ కు, ఏ రోజు, ఏ మిల్లుకి అమ్ముకోవాలనేది వాళ్ళే నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించామన్నారు. ఈరోజు వరకు దాదాపు 500 మంది రైతులు ఈ వాట్సాప్ సేవలను సద్వినియోగం చేసుకున్నారన్నారు.
73373 59375 ఈ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ పెడితే ప్రాంతం, విస్తీర్ణం, పండిన ధాన్యం వివరాలన్నీ వాట్సాప్ మెసేజ్ లోనే ఆటోమేటిక్ గా వస్తుందన్నారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా రైతులు ధాన్యం అమ్ముకోవడానికి ఒక షెడ్యూల్ అనేది ఈ ప్రక్రియ ద్వారా అందించగలుగుతున్నామన్నారు. అదే విధంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కార్యాలయంలో 1967 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఇబ్బందులు, సమస్యలు తెలియజేయవచ్చన్నారు. మొట్టమొదటిసారి చరిత్ర సృష్టించబోతున్నామని 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఈ సీజన్ లో సిద్ధంగా ఉన్నామన్నారు. ఫైన్ వెరైటీ ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, ఫైన్ రకం మధ్యాహ్న భోజన పథకం కోసం, పాఠశాలలకు నాణ్యమైన బియ్యం అందించే విధంగా ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు.
పాత్రికేయుల సమావేశంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ మరియు ఎండీ ఎస్. ఢిల్లీ రావు ఉన్నారు.
