మైనారిటీల సంక్షేమమే లక్ష్యం
మైనారిటీల సంక్షేమమే లక్ష్యం
- మైనారిటీ సంక్షేమ పథకాలపై మంత్రి ఫరూక్ సమీక్ష
- కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత కు అనుగుణంగా ముందుకు సాగాలి
- అధికారులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్
అమరావతి నవంబరు 18 : రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం తమ శాఖల పరిధిలో సంక్షేమ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అధికారులకు సూచించారు.మంగళవారం వెలగపూడి సచివాలయంలోని మూడవ బ్లాక్ లో మైనారిటీ మంత్రిత్వ శాఖ పేషీ కార్యాలయంలో మైనారిటీ శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్, మైనారిటీ సంక్షేమ శాఖ వివిధ విభాగాల ఉన్నతాధికారులతో మంత్రి ఫరూక్ సమీక్ష చేశారు.ఉర్దూ అకాడమీ,కేంద్ర పథకాల సమర్థ వినియోగం, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, ఉపాధి రుణాలు పై తదితర అంశాలపై మంత్రి ఫరూక్ సుధీర్ఘoగా సమీక్ష చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతి, వివిధ భవనాల నిర్మాణ పనుల పూర్తికి నిధుల వినియోగం, ప్రధాన మంత్రి విరాసత్ క సంవర్ధన్ ( పీఎం వికాస్ ), ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం ( పీఎంజేవీకే ), జాతీయ మైనారిటీల అభివృద్ధి ఆర్థిక సంస్థ ( ఎన్ ఎం డి ఎఫ్ సి ) పథకాల ద్వారా రాష్ట్రానికి వచ్చే నిధుల వినియోగం, హజ్ -2026 యాత్రకు తీసుకొనే ముందస్తు చర్యల ప్రణాళిక,వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, పురోభివృద్ధికి చర్యలు, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల పంపిణీ, తదితర అంశాలపై మైనారిటీ సంక్షేమ శాఖ విభాగాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయన్న విషయాలపై మంత్రి ఫరూక్ ఆరా తీశారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి యాకుబ్ భాష,వక్ఫ్ బోర్డు సీఈవో మహమ్మద్ అలీ, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి ఏ.శేఖర్ లు తమ విభాగాల పరిధిలో అమలవుతున్న, తీసుకుంటున్న చర్యలను మంత్రికి వివరించారు.ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ. రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయానికి అనుగుణంగా మైనారిటీ అనుబంధ సంక్షేమ విభాగాలన్నీ పనిచేయాలని ఆదేశించారు. కేంద్ర మైనారిటీ పథకాలను కూడా సమర్థవంతంగా వినియోగించుకునేoదుకు సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. మైనార్టీల ఆర్థిక ఉన్నతి కోసం, స్వయం ఉపాధి కల్పన కోసం నైపుణ్య అభివృద్ధి శిక్షణతో పాటు, సరళీకృతమైన విధానాలతో రుణాలను బ్యాంకుల ద్వారా అందించడం, రాయితీకి సంబంధించిన అంశాలపై అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఫరూక్ అధికారులను ఆదేశించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలను అమలు చేయడం జరుగుతుందని, అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు, ఉన్న ఆస్తులను ఏ విధంగా వినియోగించుకొని అభివృద్ధి, ఆదాయం సమకూరేలా తీసుకునే చర్యలపై మైనారిటీ సంక్షేమ, అనుబంధ విభాగాల అధికారులకు మైనారిటీ మంత్రి ఫరూక్ దిశా నిర్దేశం చేశారు. వచ్చేనెలలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా రాష్ట్రస్థాయి తో పాటు , జిల్లాల కేంద్రాల్లో హైటీ కార్యక్రమాలను క్రిస్మస్ కు ముందుగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి ఏ. శేఖర్ ను మంత్రి ఫరూక్ ఆదేశించారు.*
