మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ కు జనసందోహం
మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బార్ కు జనసందోహం
మంగళగిరి: 04 నవంబర్ 2025(పీపుల్స్ మోటివేషన్):
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమం 70వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ప్రజాదర్బార్ నిరంతరాయంగా సాగుతోంది. తమ సమస్యలను నేరుగా మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ఉదయం నుంచే కార్యాలయానికి తరలివచ్చారు. లోకేశ్ ప్రతి ఒక్కరి వినతులను ఓపికగా విని, ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇప్పటివరకు సుమారు 2 వేల మందిని కలసి వినతులు స్వీకరించినట్లు తెలిసింది.
స్థానిక సమస్యల పరిష్కారంపై లోకేశ్ అక్కడికక్కడే స్పందించి, సంబంధిత అధికారులకు వెంటనే సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను కలిసిన సందర్భంగా ఆయన వారితో ఫోటోలు కూడా దిగారు. క్యూలో ఉన్న చివరి వ్యక్తిని కలిసే వరకు ప్రజాదర్బార్ కొనసాగుతుందని మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
ప్రజల సమస్యల పరిష్కారాన్ని ప్రథమ ప్రాధాన్యంగా చూస్తున్నామనే విషయాన్ని లోకేశ్ మరోసారి ఈ కార్యక్రమం ద్వారా స్పష్టం చేసినట్టు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.


