హర్మన్‌ప్రీత్ సేనకు బీసీసీఐ బహుమతి
హర్మన్‌ప్రీత్ సేనకు బీసీసీఐ బహుమతి
ముంబై, నవంబర్ 3 (పీపుల్స్ మోటివేషన్):
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ను సాధించి సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం లిఖించింది హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ఉమెన్ ఇన్ బ్లూ జట్టు. ఈ విజయంపై బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన టీమ్ ఇండియాకు రూ.51 కోట్లు బహుమతిగా అందజేస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళల వన్డే ప్రపంచకప్‌ను స్వదేశంలోనే భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం సుమారు 40 వేల మంది అభిమానుల సమక్షంలో నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి కొత్త చరిత్ర సృష్టించింది. భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో సౌతాఫ్రికా జట్టు 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది.
సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ (101; 98 బంతుల్లో, 11 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత శతకంతో పోరాడినా, ఇతర బ్యాటర్లు విఫలమవడం జట్టును కాపాడలేదు. బ్యాట్‌తో అద్భుతంగా ఆడిన దీప్తి శర్మ బంతితోనూ (5 వికెట్లు 39 పరుగులకు) రాణించి సఫారీ జట్టును కట్టడి చేసింది.
టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు సాధించింది. షెఫాలీ వర్మ (87; 78 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీప్తి శర్మ (58; 58 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన (45; 58 బంతుల్లో, 8 ఫోర్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా షెఫాలీ వర్మ నిలిచింది. టోర్నీలో 215 పరుగులు, 22 వికెట్లతో దీప్తి శర్మ ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు గెలుచుకుంది.
ప్రైజ్‌మనీ వివరాలు
విజేత భారత్ జట్టు – 44 లక్షల 80 వేల డాలర్లు (రూ.39 కోట్లు 80 లక్షలు)
రన్నరప్ దక్షిణాఫ్రికా – 22 లక్షల 40 వేల డాలర్లు (రూ.19 కోట్లు 90 లక్షలు)
సెమీఫైనల్ జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ – చెరో 11 లక్షల 20 వేల డాలర్లు (రూ.9 కోట్లు 94 లక్షలు)
ఐదో, ఆరవ స్థానాల్లో శ్రీలంక, న్యూజిలాండ్ – చెరో 7 లక్షల డాలర్లు (రూ.6 కోట్లు 21 లక్షలు)
ఏడో, ఎనిమిదో స్థానాల్లో బంగ్లాదేశ్, పాకిస్థాన్ – చెరో 2 లక్షల 80 వేల డాలర్లు (రూ.2 కోట్లు 48 లక్షలు)
అలాగే ప్రపంచకప్‌లో పాల్గొన్న ఎనిమిది జట్లకు గ్యారంటీ మనీగా చెరో 2 లక్షల 50 వేల డాలర్లు (రూ.2 కోట్లు 22 లక్షలు) లభించాయి. లీగ్ దశలో సాధించిన ప్రతి విజయానికి 34 వేల 314 డాలర్లు (రూ.30 లక్షల 47 వేలు) చొప్పున బహుమతిగా అందాయి.
