రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

జగజ్జేత భారత్‌.. తొలి వన్డే ప్రపంచకప్‌ విజయం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

జగజ్జేత భారత్‌.. తొలి వన్డే ప్రపంచకప్‌ విజయం

-ఫైనల్లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం

-అదరగొట్టిన షెఫాలీవర్మ, దీప్తిశర్మ

-వోల్వార్డ్‌ సెంచరీ పోరాటం వృథా

ముంబై, నవంబర్‌ 3 (పీపుల్స్ మోటివేషన్):

భారత క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టం నమోదు అయింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీ ఎట్టకేలకు భారత్‌ దక్కించుకుంది. స్వదేశంలో నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో దక్షిణాఫ్రికాపై ఫైనల్లో గెలిచి, టీమ్‌ ఇండియా జగజ్జేతగా నిలిచింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ అర్ధశతకాలతో భారత్‌ భారీ స్కోరు సాధించగా, సఫారీ కెప్టెన్‌ లారా వోల్వార్డ్‌ సెంచరీ పోరాటం వృథా అయింది. బంతితో దీప్తి శర్మ ఐదు వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. కోట్లాది భారతీయుల కలను సాకారం చేస్తూ మహిళామణులు మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించారు.

ఆదివారం నవీ ముంబయిలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ఉమెన్‌ ఇన్‌ బ్లూ 52 పరుగుల తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత్‌ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. లారా వోల్వార్డ్‌ (101; 98 బంతుల్లో, 11 ఫోర్లు, 1 సిక్స్‌) అద్భుతంగా పోరాడినా, మిగిలిన బ్యాటర్లు విఫలమవడంతో జట్టు ఓటమిని తప్పించుకోలేకపోయింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు సాధించింది. షెఫాలీ వర్మ (87; 78 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీప్తి శర్మ (58; 58 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్స్‌), స్మృతి మంధాన (45; 58 బంతుల్లో, 8 ఫోర్లు) రాణించారు. మ్యాచ్‌ ఉత్తమ ఆటగాడిగా షెఫాలీ వర్మ నిలిచింది. టోర్నీలో 215 పరుగులు, 22 వికెట్లతో దీప్తి శర్మ టోర్నీ ఉత్తమ ఆటగాడిగా ఎంపికైంది.

షెఫాలీ దూకుడు

నాకౌట్‌ దశలో జట్టులోకి వచ్చిన షెఫాలీ కీలక మ్యాచ్‌లో దూకుడుగా ఆడి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంది. స్మృతి మంధానతో తొలి వికెట్‌కు 104 పరుగులు జోడించి బలమైన పునాది వేసింది. అర్ధశతకం పూర్తిచేసిన అనంతరం 28వ ఓవర్లో ఔటైన ఆమె ఇన్నింగ్స్‌ జట్టుకు దిశానిర్దేశం చేసింది.

వోల్వార్డ్‌ పోరాటం

సఫారీ జట్టు కెప్టెన్‌ లారా వోల్వార్డ్‌ అద్భుత శతకంతో ఆకట్టుకుంది. కానీ ఆమె పోరాటానికి తోడుగా మిగిలిన బ్యాటర్లు నిలువలేకపోవడంతో సౌతాఫ్రికా చేతులెత్తేసింది. రాధా యాదవ్‌, షెఫాలీ, దీప్తి బౌలింగ్‌లో వికెట్లు తీసి భారత్‌ను విజయ మార్గంలో నడిపించారు.

దీప్తి మ్యాజిక్‌

భారత బౌలర్‌ దీప్తి శర్మ 5 వికెట్లు తీయడం ద్వారా మ్యాచ్‌ను పూర్తిగా భారత్‌ వైపు తిప్పింది. లారా వోల్వార్డ్‌, ట్రయాన్‌, డెర్క్‌సెన్‌ వంటి కీలక బ్యాటర్లను ఔట్‌ చేసి ప్రత్యర్థి ఆశలను ఛిద్రం చేసింది.

కలల కప్‌ సొంతం

భారత మహిళల జట్టు తొలిసారి ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ గెలుచుకోవడం చరిత్రాత్మక ఘట్టం. అబ్బాయిల విజయాల తరహాలో అమ్మాయిలు కూడా ప్రపంచాన్ని జయించి భారత క్రీడా చరిత్రలో సువర్ణ అధ్యాయం లిఖించారు. సొంత గడ్డపై సాధించిన ఈ విజయం వారికి మాత్రమే కాకుండా మొత్తం దేశానికి గర్వకారణం అయింది.

ఏడాది క్రితం అబ్బాయిలు సఫారీలను ఓడించి టీ20 ప్రపంచకప్‌ గెలిచిన సందర్భం గుర్తుచేసేలా మహిళామణులు వన్డేలో అదే ప్రతాపాన్ని ప్రదర్శించారు. ఇంతకుముందు రెండు సార్లు చేజారిన వన్డే కప్‌ను మూడో ప్రయత్నంలో కైవసం చేసుకున్నారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని ఈ జట్టు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లను ఓడించి టైటిల్‌ దక్కించుకుంది.

ప్రయాణం – విజయ కధనం

టోర్నీని శ్రీలంకపై ఘన విజయం సాధిస్తూ ప్రారంభించిన భారత్‌ పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఊపందుకుంది. మధ్యలో మూడు ఓటములతో వెనకబడినా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌పై గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచి చరిత్ర సృష్టించింది.

ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీక రావల్‌ మంచి ఆరంభాలు అందించగా, జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌, దీప్తి శర్మ, రీచా ఘోష్‌ కీలక పాత్ర పోషించారు. బౌలింగ్‌లో క్రాంతిగౌడ్‌, రేణుకా ఠాకూర్‌, శ్రీచరణి, దీప్తి శర్మ వికెట్ల వేట కొనసాగించారు.

భారత మహిళల జట్టు ఏ ఫార్మాట్‌లో అయినా ఐసీసీ ట్రోఫీ గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఈ విజయంతో భారత క్రికెట్‌ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.

Comments

-Advertisement-