దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తి కావాలి.
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తి కావాలి.
బ్రిటిష్ వారిపై పోరాడి గిరిజన ఉద్యమానికి నాయకత్వం వహించిన భగవాన్ బిర్సా ముండా స్ఫూర్తి ప్రదాత
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు, నవంబర్ 15 (పీపుల్స్ మోటివేషన్):-
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తి కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అన్నారు.
శనివారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన జన్ జాతీయ గౌరవ దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్తీ ఆబ భగవాన్ బిర్సా ముండా, ఆలూరి సీతారామరాజు, గామ్ గంటందొర, కుడుముల పెద్ద బయన్న, హనుమంతప్ప, బోనంగి పండు పడాల్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, గాం మల్లు దొర తదితర గిరిజన నేతల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...1875 నవంబర్ 15న రాంచీ సమీపంలోని ఉలిహట్ గ్రామంలో జన్మించిన భగవాన్ బిర్సా ముండా బ్రిటిషర్లు అన్యాయంగా విధించినపన్నుల రద్దు కోసం గిరిజనులను ఏకం చేసి అపూర్వమైన విప్లవ పోరాటం నడిపారని పేర్కొన్నారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఆయన చేసిన పోరాటం నేటికీ కోటానుకోట్ల మందికి స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. స్వార్థం లేకుండా దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆశయాలను మనం అనుసరించాలన్నారు. కర్నూలు జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఆ ప్రాంత ప్రజల అభ్యున్నతికి ప్రతిఒక్కరూ నిస్వార్థ సేవ చేయాలి. చిన్న సహాయం చేసినా ప్రజలు ఎంతో పెద్దగా భావించే గుణం ఈ ప్రాంతపు ప్రజల్లో ఉందని అన్నారు. వివాదాలు, కక్షలు, సామాజిక విభేదాలు నుండి బయటపడాలంటే విద్యే మార్గం. చదువుతోనే ప్రాంతం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. యువత చదువుతో ఎదగాలని, సమాజానికి ఉపయోగకరంగా మారాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో డిఆర్ఓ వెంకట నారాయణమ్మ, గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి. సురేష్, లంబాడి హక్కుల పోరాట సమితి సభ్యులు కైలాష్ నాయక్, యోగేష్ నాయక్, ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు చంద్రప్ప, ఎరుకల పోరాట సమితి సభ్యులు ఎరుకల రాజు, ఎస్టిఎఫ్ ఎంప్లాయ్ ప్రెసిడెంట్ రాము నాయక్, మద్దిలేటి, అడ్వకేట్ బాలస్వామి, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కుషాల్ అన్న , సిబ్బంది మరియు గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

