రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అన్నదాత అభివృద్ధికి పంచసూత్రాలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

అన్నదాత అభివృద్ధికి పంచసూత్రాలు

  • నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అంశాలపై ఫోకస్
  • రైతు మీసం మెలేసే రోజులు రాబోతున్నాయి
  • మొంథా తుఫాన్ బాధిత రైతులకు త్వరలో రూ.390 కోట్లు ఇస్తాం
  • రెండో విడత అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
  • రెండో విడతలో రూ. 3135 కోట్ల మేర చెల్లింపులు
  • 46,85,838 మంది రైతులకు రూ.3,135 కోట్ల మేర లబ్ధి

కమలాపురం/కడప జిల్లా, నవంబర్ 19: వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు... అన్నదాతకు అండగా నిలిచేందుకు.. పంచసూత్ర ప్రణాళికతో వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగు ఐటీ నిపుణులకు ఎంత మంచి పేరు ఉండో... ఏపీ రైతులు కూడా ప్రపంచ వ్యాప్తంగా అదే స్థాయిలో గుర్తింపు రావాలని సీఎం చంద్రబాబు చెప్పారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండో విడత నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. రెండో విడత చెల్లింపుల్లో భాగంగా రూ.7 వేల చొప్పున 46,85,838 మంది రైతుల ఖాతాలకు రూ.3,135 కోట్లను జమ చేశారు. రచ్చబండలో పాల్గొని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ప్రజావేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు సాగు విధానాలు అవలంభించాలి. సాగులో టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెడితే పెట్టుబడి వ్యయం తగ్గుతుంది. మనది రైతు ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకంలో భాగంగా తొలి విడతలో రూ.3,175 వేల కోట్ల సొమ్మును ఈ ఏడాది ఆగస్టులో జమ చేశాం. రెండు విడతలు కలిపి మొత్తం రూ.6,310 కోట్లు అన్నదాతకు అందించాం. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం నిధులు జమ చేయడం రైతు సంక్షేమంపై ప్రజా ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం”అని సీఎం చంద్రబాబు అన్నారు. 

పంచ సూత్రాల అమలుతో రైతే రాజు

“నీరు సమృద్ధిగా ఉన్నచోటే అభివృద్ధి జరిగింది. రాయలసీమ వాసుల కష్టాలు నేను కళ్లారా చూశాను. కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తయారు చేసి ప్రతి ఎకరాకు నీరివ్వాలన్నదే నా సంకల్పం. భూగర్భ జలాలు పెంచాలి. ఒకప్పుడు సీమలో 100 అడుగుల కింద నీరు ఉండేది. ఇప్పుడు 7.3 మీటర్లకే నీరు వస్తోందంటే మన దూరదృష్టి వల్లే సాధ్యమైంది. ఆనాడు నా నియోజకవర్గం కుప్పంలో ఇజ్రాయిల్ టెక్నాలజీ తీసుకొచ్చి మైక్రో ఇరిగేషన్ కు వెళ్లాం. భూగర్భ జలాలు పెరిగితే పర్యావరణం కూడా బాగుంటుంది. రాష్ట్రంలో నీటిభద్రత కల్పించేందుకు నిరంతరం పని చేస్తున్నాం. పట్టిసీమ పూర్తిచేసి కృష్ణా డెల్టాకు నీరందించాం. సముద్రంలోకి వృథాగా పోయే వరద నీటిని రాయలసీమ వైపు మళ్లించి రిజర్వాయర్లు నింపాం. హంద్రినీవా ద్వారా సీమకు నీరిచ్చాం. రాష్ట్రంలో 95 శాతం జలాశయాలు నిండాయి. చెప్పిన విధంగా నదుల అనుసంధానం చేసి చూపిస్తాం. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉండబట్టే రైతులకు మేలు జరుగుతోంది.”అని సీఎం అన్నారు. 

ప్రకృతి సేద్యం చేయాలి... డిమాండ్ ఉన్న పంటలు పండించాలి

“ప్రపంచవ్యాప్తంగా ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. ఇందుకు అనుగుణంగా మన సాగు పద్ధతులు మారాలి. ప్రకృతి సేద్యం వైపు రైతులు మళ్లాలి. డిమాండ్ ఉన్న పంటలను పండించాలి. రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం జరుగుతోంది. ఇంకో 6 లక్షల ఎకరాలను ప్రకృతి సేద్యం పరిధిలోకి తీసుకువస్తున్నాం. మొత్తంగా 18 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీనే. ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన పంజాబ్ లో ఎరువుల వాడకం విపరీతంగా పెరగడంతో ప్రజలు క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నారు. ప్రస్తుతం రసాయనిక రహిత పంటలకే విదేశాల్లో కూడా డిమాండ్ ఉంది. టెస్టింగ్, ట్రేసబులిటీ వంటి అంశాలనేవి ఇప్పుడు దేశ, విదేశాల్లో కీలకంగా మారాయి. అందుకే రైతులు క్రిమిసంహారక మందులు, ఎరువుల వాడకం తగ్గించాలి.”అని చంద్రబాబు పేర్కొన్నారు.

సాగులో సాంకేతికత పెరగాలి

“వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగాన్నే అగ్రిటెక్ అంటారు. సాగులో సరికొత్త విధానాలను ఎప్పటికప్పుడు రైతులకు పరిచయం చేస్తాం. ఏ పంటకు డిమాండ్ ఉందో ముందే వివరిస్తాం. అన్నదాతలు వ్యవసాయంలో పాత విధానాల్ని వదిలి కొత్త మార్గాల్ని అన్వేషించాలి. టెక్నాలజీ వినియోగంతో సాగు వ్యయం తగ్గుతుంది. ప్రధాని మోదీ చెప్పినట్టు ప్రకృతి సేద్యంలో ముందుండే రాష్ట్రానిదే భవిష్యత్. నేనూ రైతు బిడ్డనే. వ్యవసాయంలో రాత్రికి రాత్రి మార్పు తెచ్చేస్తామని నేను చెప్పడం లేదు. కానీ సాగు తీరు మారాలనే ఉద్దేశంతో పని చేస్తున్నాం. భూసార పరీక్షలు.. గాలుల గమనాలు... పంటలకున్న డిమాండ్... వాతావరణంలో వస్తున్న మార్పులను, క్రిమీ సంహరక వాడకం, 

సాగులో డ్రోన్లు, శాటిలైట్ల వినియోగం ద్వారా రైతుల ఆదాయం పెరిగేలా చూస్తున్నాం. రాయలసీమలో డ్రోన్, స్పేస్ సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. స్పేస్ సిటీ ద్వారా శాటిలైట్లను అద్దెకు తీసుకుంటాం. వీటి ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తాం. రైతుల ఆదాయాన్ని మరింతగా అభివృద్ధి చేసేలా చూస్తున్నాం. అందుకే రైతుల అభివృద్ధికి పంచసూత్రాలు తీసుకొచ్చాం. అలాగే గత ఐదేళ్లలో భూసార పరీక్షలు నిలిపేశారు. మళ్లీ వాటిని మొదలు పెట్టాం. 

నేను డ్రిప్ ఇరిగేషన్ కింద రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తే గత ప్రభుత్వం రద్దు చేసింది. డ్రిప్ ఇరిగేషన్‌ రాయితీని ఎస్సీ, ఎస్టీలకు 100 శాతానికి, రాయలసీమ-ప్రకాశం జిల్లాలో 90 శాతానికి, కోస్తాలో 70 శాతానికి పెంచాం.”అని ముఖ్యమంత్రి వివరించారు.

రైతుల కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

”రైతులకు మరింత ఆదాయం చేకూరేలా రూ.13 వేల కోట్ల పెట్టుబడులతో 38 ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు సీఐఐ సదస్సులో ఎంఓయూలు కుదుర్చుకున్నాం. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈల ఏర్పాటుతో ఫుడ్ప్రాసెసింగ్‌కు ప్రోత్సాహం ఇస్తున్నాం. మన రాష్ట్రంలో పండని పంట లేదు. అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, హార్టికల్చర్, సెరీకల్చర్‌లో మనకు తిరుగులేదు. పశుపోషణ, పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తిలో మనం ముందున్నాం. రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా, కోస్తా ఆక్వా హబ్ గా తయారవుతోంది. అరకులో కాఫీని ప్రోత్సహిస్తున్నాం. మనం తీసుకున్న చర్యలతో కోకో ఉత్పత్తి చేసే ఏకైక రాష్ట్రంగా ఏపీగా నిలిచింది. కోనసీమలో కొబ్బరి సాగు జరుగుతోంది. మనం పండించే ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి డిమాండ్ వస్తోంది.”అని సీఎం తెలిపారు.

సర్కారీ సాయంతో వ్యవసాయాభివృద్ధి

”ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు తక్షణం స్పందిస్తున్నాం. మార్కెట్ ఇంటర్వేన్షన్ ద్వారా రైతులను ఆదుకుంటాం. పంటలకు మద్దతు ధర లేకున్నా... విపత్తులు సంభవించినా... వెంటనే స్పందిస్తున్నాం. ఆ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చాక విపత్తులకు నష్టపరిహం నిమిత్తం రూ. 310 కోట్లు చెల్లింపులు జరిపాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నుంచి రూ.15,955 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 24 గంటల్లోనే డబ్బులు చెల్లిస్తున్నా మొంథా తుఫానుకు నష్టపోయిన రైతులకు రూ.390 కోట్ల పరిహరాన్ని త్వరలో చెల్లిస్తేం”అని ముఖ్యమంత్రి తెలిపారు. 

సంక్షేమం అందిస్తాం... అభివృద్ధి చేస్తాం

“2024 సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే తల్లికి వందనం, స్త్రీ శక్తి-ఉచిత బస్సు, దీపం –2, ఎన్టీఆర్ భరోసా పించన్లు, మెగా డీఎస్సీ వంటి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశాం. విధ్వంస, ఆటవిక పాలన ఎలా ఉంటుందో గత పాలనలో చూశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీకి కట్టుబడి ఉన్నాం. విశాఖ భాగస్వామ్య సదస్సులో 613 ఎంఓయూలు చేసుకున్నాం. వీటి ద్వారా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల ఉద్యోగాలు వస్తాయి. రాయలసీమను పారిశ్రామిక హబ్ గా తయారుచేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా అడుగులు వేస్తున్నాం.”అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే చైతన్య రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-