జర్మనీ పెట్టుబడులకు హాట్ స్పాట్‌గా అవతరించనున్న హైటెక్ సిటీ
జర్మనీ పెట్టుబడులకు హాట్ స్పాట్‌గా అవతరించనున్న హైటెక్ సిటీ
- గ్లోబల్ ఇన్నొవేషన్ మ్యాప్‌లో హైదరాబాద్ – జర్మనీ భాగస్వామ్యం కీలకం
- జర్మనీ సంస్థల పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, నవంబర్ 4 (పీపుల్స్ మోటివేషన్):
హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నొవేషన్ హబ్‌గా అభివృద్ధి చేసే దిశలో తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. జర్మనీకి చెందిన పెట్టుబడిదారులు, సంస్థలు రాష్ట్ర అభివృద్ధి యాత్రలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో జర్మనీ కంపెనీల పెట్టుబడులు రాష్ట్రానికి అవసరమైన సాంకేతిక పురోగతికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
చెన్నై జర్మనీ కాన్సులేట్ జనరల్ కాన్సుల్ జనరల్ మైఖేల్ హాస్పర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సమావేశమైంది. ప్రముఖ బహుళజాతి కంపెనీ డుయిష్ బోర్సా హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ వివరాలను సీఎం కు అందజేశారు. రెండు సంవత్సరాల్లో ఈ జీసీసీ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగాలు సృష్టించనున్నట్లు జర్మనీ ప్రతినిధులు వివరించారు.
హైదరాబాద్‌ను జీసీసీ కోసం ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి సీఎం ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమలకు కావలసిన వాతావరణం, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తెలంగాణ విద్యార్థులకు జర్మన్ భాషా శిక్షణ అందించేందుకు జర్మన్ టీచర్లను హైదరాబాద్‌లో నియమించే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం కోరారు. విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం TOMCOM ద్వారా నైపుణ్యాభివృద్ధి, వృత్తిపరమైన శిక్షణ, స్కిల్ వర్క్‌లో జర్మనీ సహకరించాలని అభ్యర్థించారు. ఈ సమావేశంలో డుయిష్ బోర్సా సీఐఓ క్రిస్టోఫ్ బోమ్, జర్మనీ గౌరవ కాన్సూల్ (ఏపీ, తెలంగాణ) అమిత ఆర్ దేశాయ్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
