పరిశుభ్రమైన సమాజం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం
పరిశుభ్రమైన సమాజం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, నవంబర్ 15 (పీపుల్స్ మోటివేషన్):-
పరిశుభ్రమైన సమాజం – ఆరోగ్యవంతమైన సమాజానికి దారితీస్తుందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు..
శనివారం స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ పంచాయతీలో "వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత" అనే థీమ్ తో నిర్వహించిన ర్యాలీ లో కలెక్టర్ పాల్గొని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆవరణంలో మొక్కలు నాటారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 3 వ శనివారం స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.. అందులో భాగంగానే ఈరోజు వ్యక్తిగత మరియు సమాజ పరిశుభద్రత అనే థీమ్ తో కార్యక్రమాలు చేసుకుంటున్నామన్నారు... స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో భాగంగా మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి, ప్లాస్టిక్ వాడకం ఎలా తగ్గించాలి, నీటిని, నీటి వనరులను ఎలా వాడుకోవాలి, నీటి వనరులను ఎంత పరిశుభ్రంగా ఉంచాలనే దాని మీద కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరిగిందన్నారు.. అదే విధంగా ఈరోజు కార్యక్రమంలో వ్యక్తిగత మరియు సామాజిక పరిశుభ్రత గురించి కూడా మాట్లాడుకోవడం జరుగుతుందన్నారు.. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సమాజ పరిశుభ్రతను ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలన్నారు... ప్రతి రోజు 2 సార్లు స్నానం చేయాలన్నారు.. వారానికి ఒకసారి గోర్లను కట్ చేసుకోవాలన్నారు.. తినే ముందు, తిన్న తర్వాత ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నారు.. మొదటి నుంచి అలవాట్లు నేర్పిస్తే ఖచ్చితంగా జీవితాంతం ఇలాంటి అలవాట్లు పాటిస్తారని కలెక్టర్ తల్లి తండ్రులకు సూచించారు...
ప్రభుత్వ సహాయంతో టాయిలెట్స్ నిర్మిస్తున్నామని, అయితే వాటిని కట్టెలు, కోళ్లు ఉంచడానికి ఉపయోగిస్తున్నారన్నారు... మహిళలు రాత్రిపూట టాయిలెట్ అవసరమైనప్పుడు బయటికి వెళ్లిన సమయంలో కుక్కలు కరవడం, లేకపోతే పాములు కరవడం లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది ఎదుర్కోవడం లాంటివి జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం అలాంటి సమస్యలు తలెత్తకుండా టాయిలెట్స్ నిర్మాణం చేసి ఇస్తున్నారని, కాబట్టి ప్రజలు టాయిలెట్ లను ఉపయోగించుకోవాలని కలెక్టర్ కోరారు.... మలవిసర్జన బయట చేస్తే మట్టిని, నీటిని రెండిటిని కలుషితం చేసినవారు అవుతారన్నారు.. దానివల్ల ఎన్నో రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. మనం ఇప్పటికే చాలావరకు మట్టిని, నీటిని, గాలిని కాలుష్యం చేసినందుకు గాను ప్రతి 10 మందిలో 5 మందికి క్యాన్సర్ ఉంటుందన్నారు... రాబోయే తరం పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కన్నా ముఖ్యంగా మట్టిని, నేలని, గాలిని, నీటిని సంరక్షించుకొని వారికి ఇవ్వాలన్నారు..అందుకు గాను మనం ప్లాస్టిక్ వ్యర్ధాల్ని జాగ్రత్తగా తడి, పొడి చెత్తగా వేరు చేసుకొని శానిటేషన్ వర్కర్స్ కి ఇవ్వాలన్నారు.. ఇంటి బయట చెత్త పడేయకుండా ప్రతి రోజు డోర్ టు డోర్ కలెక్షన్ కోసం వచ్చే సిబ్బందికి చెత్తను ఇవ్వాలన్నారు..
ఈ ప్రాంతంలో కొంచెం నీరు ఉన్నా కూడా వరి పండిస్తున్నారని, వరి పంట ఎక్కువ నీటిని వినియోగించుకుంటుంది కాబట్టి ఉన్న నీటిని మనం జాగ్రత్తగా వాడుకోవాలంటే వరి పంట కాకుండా, కందులు, శనగలు, ఆముదం లాంటి పంటలను పండించినట్లయితే తక్కువ నీటిని వాడడంతో పాటు మంచి పంటను పండించుకోగలుగుతామని, మంచి ధర కూడా ఆ పంటలకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.. పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్, యూరియా లాంటివి కూడా ఇక్కడ ఎక్కువగా వాడుతున్నారని వాటి ద్వారా కూడా మన మట్టి కలుషితం అవుతుందన్నారు... ఎక్కడైతే నీటి వసతులు బాగా ఉన్నాయో అక్కడ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్, యూరియా లాంటివి ఎక్కువగా వినియోగించకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలన్నారు.. పూర్తిగా రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేసినట్లైతే దిగుబడి బాగా వస్తుందని, ఆ పంటకు ధర బాగా వస్తుందని, అలాగే దాని సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పంట కూడా పాడవకుండా ఉంటుందన్నారు.. ప్రకృతి వ్యవసాయం కొరకు 4 వేలు పెట్టుబడి పెడితే 60 వేల నుండి 70 వేల రూపాయల వరకు లాభం వచ్చే అవకాశం ఉందన్నారు.. అంతే కాకుండా రైతులు ఒక పంట వేసి దాని మీదే ఆధారపడి ఉండకుండా రెండు, మూడు పంటలు వేసినట్లయితే ఒక పంటకు నష్టం వచ్చినా, ఇంకో పంటకు లాభం వచ్చే అవకాశం ఉంటుందన్నారు.. అదే విధంగా ఇక్కడ గొర్రెలు ఎక్కువ పెంచుకుంటూ ఉన్నారని, ఆవులను కూడా పెంచుకోవాలని, ఆదాయం మరింత వచ్చే అవకాశం ఉంటుందన్నారు..
కర్నూలు జిల్లాలో అక్షరాస్యత 56 శాతం మాత్రమే ఉందన్నారు. ఇక్కడ కొంతమంది వలసలు వెళ్ళిపోతున్నారని, వలసలు వెళ్ళే సమయంలో పిల్లల్ని కూడా వారితో తీసుకొని వెళ్ళిపోతున్నారని, ఆ విధంగా చేయడం ద్వారా పిల్లలు కూడా భవిష్యత్తులో కూలి పనులకు వెళ్ళే పరిస్థితి చేసే వారవుతారన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం పిల్లలు చదువుకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సీజనల్ హాస్టల్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, వలసలకు వెళ్ళే సమయంలో పిల్లలను మీతో పాటు తీసుకొని వెళ్లకుండా వారిని సీజనల్ హాస్టల్ లో చేర్పించి వారి విద్యకు ఎటువంటి అంతరాయం కలిగించకుండా చూడాలన్నారు.. విద్య అనేది చాలా ముఖ్యం అని, ఎన్ని సమస్యలు వచ్చినా పిల్లల్ని చదివించాలని కలెక్టర్ హాజరైన తల్లి తండ్రులను కోరారు.. అదే విధంగా ఆడపిల్లలకు 10వ క్లాసు అవగానే పెళ్లిళ్లు చేస్తున్నారని, చిన్నప్పుడే పెళ్లిళ్లు చేస్తే ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదురుకోవాల్సి వస్తుందని, టీనేజ్ ప్రెగ్నెన్సీ రావడం ద్వారా తల్లి కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు.. అమ్మాయి 18 ఏళ్లు వయసు వచ్చిన తర్వాతే పెళ్లి చేయాలన్నారు.. అమ్మాయిలని, అబ్బాయిల్ని చదివించాలని వాళ్ళకు యుక్త వయస్సు వచ్చిన తర్వాతే పెళ్లి చేయాలన్నారు.. పిల్లల ఆరోగ్యం చాలా చాలా ముఖ్యమని, వారు మంచి ఆహారం తీసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తరఫునుంచి మిడ్ డే మీల్స్ కూడా ఇస్తున్నామన్నారు... పిల్లలకు ఏది మంచి ఏది చెడు అని చేయడంలో పేరెంట్స్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుందన్నారు.. పిల్లల జీవితం తీర్చిదిద్దడానికి దిశగా అడుగులు వేసి అందరిని కూడా చదివించాలని కలెక్టర్ కోరారు..
అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వంట గదిని పరిశీలిస్తూ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందచేయాలని కలెక్టర్ వంట సిబ్బందిని ఆదేశించారు..
కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డిపిఓ భాస్కర్, ఎంపిడిఓ నాగ అనసూయ , తహసిల్దార్ విద్యా సాగర్, డీ ఎల్ డి ఓ రమణ రెడ్డి, సర్పంచ్ బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

