అణగారిన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే కృషి
అణగారిన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే కృషి
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
విజయవాడ/అమరావతి : అణగారిన వర్గాలు, స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానుభావుడు జ్యోతిరావు పూలే అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. మహ్మాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్ర ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, దేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్తల్లో మహాత్మా జ్యోతిరావు పూలే ముందు వరుసలో ఉంటారన్నారు. అణగారిన వర్గాలు, స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు. మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన జ్యోతిరావు పూలే అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు చివరి వరకూ రాజీలేని పోరాటం చేశారన్నారు. తొలి బాలికలకు పాఠశాల స్థాపించడమే కాకుండా, ఆ పాఠశాలలో అన్ని కులాలకూ ప్రవేశం కల్పించారన్నారు. వితంతు పునర్వివాహాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కాకుండా జ్యోతిరావు పూలే స్వయంగా వితంతువులకు వివాహాలు కూడా జరిపించారన్నారు. జ్యోతిరావు పూలే స్ఫూర్తితో సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతో బీసీ గురుకుల పాఠశాలలను స్థాపించిన ఘనత కూడా టీడీపీదేనన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకటగురుమూర్తి, డూండీ రాకేశ్, పేరేపి ఈశ్వర్, బ్రహ్మ చౌదరి, యాటగిరి రాంప్రసాద్, యర్రబోతు రమణారావు, పలువురు డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
