టి-హబ్ వార్షికోత్సవం: భారత స్టార్టప్ విప్లవానికి తెలంగాణే ఆది కేంద్రం
టి-హబ్ వార్షికోత్సవం: భారత స్టార్టప్ విప్లవానికి తెలంగాణే ఆది కేంద్రం
హైదరాబాద్, 5 నవంబర్ (పిపూల్స్ మోటివేషన్): 2015 నవంబర్ 5న ఆవిర్భవించిన టి-హబ్, దేశంలో స్టార్టప్ సంస్కృతికి నూతన దిశాబోధన చేసిన సంస్థగా ప్రతిష్టను పొందింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం, ఆర్థిక వ్యవస్థను ఇన్నోవేషన్‌పై ఆధారపడి బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్మించిన టి-హబ్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రూపుదిద్దుకుని, దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా స్టార్టప్స్‌కు విశ్వసనీయ మార్గదర్శక వేదికగా నిలిచిందని పేర్కొన్నారు.
టి-హబ్ స్థాపనతో ప్రారంభమైన తెలంగాణ ఇన్నోవేషన్ ప్రయాణం, క్రమంగా సమగ్ర ఎకోసిస్టమ్‌గా అభివృద్ధి చెందింది. మహిళా వ్యాపారవేత్తలకు అవకాశం కల్పించే వీ–హబ్, విద్యార్థులు – యువతలో సృజనాత్మకత పెంపొందించే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, ప్రోడక్ట్ ఇన్నోవేషన్‌కు హార్డ్‌వేర్ R&D వేదిక టీ–వర్క్స్, నైపుణ్యాభివృద్ధికి దూతగా టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్), రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు అనుసంధానించే ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, పరిశోధన–పరిశ్రమల మధ్య అనుసంధానానికి రిచ్ (రిసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్) వంటి పలు ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా, తెలంగాణ సమగ్ర ఇన్నోవేషన్ మోడల్‌కు రూపకల్పన చేసింది.
రతన్ టాటా చేసిన “టి-హబ్ ఆధునిక భారతదేశానికి ప్రతీక” అన్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, చిన్న స్థాయిలో ప్రారంభమైన టి-హబ్ నేడు అంతర్జాతీయ గుర్తింపు పొందిన స్టార్టప్ హబ్‌గా అభివృద్ధి చెందడం గర్వకారణమని మాజీ ఐటీ శాఖ మంత్రి అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ, వ్యాపార నిర్వహణ, మెంటార్‌షిప్, ఇన్వెస్టర్ నెట్‌వర్క్ మరియు గ్లోబల్ భాగస్వామ్యాల ద్వారా వందలాది స్టార్టప్స్ ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడంలో టి-హబ్ కీలక పాత్ర పోషించినట్లు అన్నారు.
స్టార్టప్స్‌కు మార్గదర్శకత్వం అందించడం మాత్రమే కాకుండా, భారత రాష్ట్రాల్లో ఇన్నోవేషన్ మోడల్‌కు తెలంగాణ మార్గదర్శకత్వం వహించిందని వివరించారు. ఇతర రాష్ట్రాలు కూడా టి-హబ్ మోడల్‌ను పరిశీలించి తమ రాష్ట్రాల్లో ఇన్నోవేషన్ సెంటర్లు నెలకొల్పేలా ప్రేరణ పొందినట్లు తెలిపారు. “ఇన్నోవేషన్‌పై పెట్టుబడి పెట్టిన రాష్ట్రాలే భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో ముందంజలో నిలుస్తాయి. ఈ విజన్‌తో నిర్మించిన టి-హబ్ ప్రయాణం మరెన్నో స్టార్టప్స్‌కు శక్తినిస్తుంది” అని చెప్పారు.
ప్రపంచం వేగంగా టెక్నాలజీ వైపు దూసుకుపోతున్న నేపథ్యంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్‌టెక్, బయోటెక్, డీప్‌టెక్, హెల్త్‌టెక్, EV–మొబిలిటీ, గేమింగ్, అగ్రిటెక్ రంగాల్లో తెలంగాణ స్టార్టప్స్ ప్రభావం పెరుగుతుందని, రాబోయే సంవత్సరాల్లో టి–హబ్ మరింత అంతర్జాతీయ భాగస్వామ్యాలకు వేదికగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్టార్టప్స్‌కు పెట్టుబడులు, ప్రోత్సాహకాలు, ఇన్క్యుబేషన్, మెంటార్‌షిప్ ప్రోగ్రామ్‌లతోపాటు, టాలెంట్–స్కిల్ డెవలప్మెంట్‌లో తెలంగాణ చేసిన నవీన చర్యలు, దేశ స్టార్టప్ మ్యాప్‌లో రాష్ట్రాన్ని ముందంజలో నిలబెట్టినట్లు వివరించారు. టి–హబ్ తన పదేళ్ల ప్రయాణంలో చేపట్టిన కార్యక్రమాలు, ఆలోచనలను అవకాశాలుగా మార్చిన యువ పారిశ్రామికవేత్తలు దేశ ఆర్థిక వ్యవస్థలో కొత్త శక్తిని నింపుతున్నారని అభినందించారు.
స్టార్టప్ కలలను నెరవేర్చే వేదికగా నిలిచిన టి-హబ్ విజయయాత్ర కొనసాగాలని, మరిన్ని గ్లోబల్ స్థాయి యూనికార్న్ కంపెనీలు తెలంగాణ నుంచి వెలువడాలని ఆకాంక్షించారు.
