ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రత... సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి
ప్రముఖ ఆలయాల్లో భక్తుల భద్రత... సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి
• కార్తీక మాసం రద్దీకి తగిన విధంగా ఏర్పాట్లు అవసరం
• ప్రముఖ క్షేత్రాలు అన్నవరం, పాదగయ పిఠాపురం, పంచారామం సామర్లకోటతోపాటు ఇతర ఆలయాల్లో ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి
• దేవాదాయ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేయాలి
• భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు నిర్వహించాలి
• కాకినాడ జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో కాకినాడ జిల్లా పరిధిలోని ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల భద్రత, సౌకర్యాల కల్పనపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. క్యూ లైన్ల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, భద్రతాపరమైన అంశాలపై తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్, ఎస్సీలను ఆదేశించారు. కాకినాడ జిల్లా పరిధిలో ప్రముఖ శైవ క్షేత్రాలయిన సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం శ్రీ పాద గయ, అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయాలతోపాటు పలు ప్రధాన ఆలయాల్లో కార్తీక మాసంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు వివిధ శాఖల జిల్లా అధికారులకు పుణ్య క్షేత్రాలు, దేవాలయాలలో ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కాశీబుగ్గ ఘటన నేపథ్యంలో దేవాదాయ శాఖ ఆలయాల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రసిద్ధ క్షేత్రాలతోపాటు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నిర్వహణలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో దేవాదాయ శాఖ అధికారులు నివేదిక సిద్ధం చేసి జిల్లా కలెక్టర్, ఎస్పీలకు తక్షణమే అందించాలి. అక్కడ కూడా రద్దీ విషయమై పర్యవేక్షణ చేయాలి.
ఈ నెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి ఉన్నందున ఆ రోజు, ఆ తరవాతి రోజు ఉండే రద్దీని అంచనా వేసుకోవాలి. ముఖ్యంగా శని, ఆది, సోమవారాల్లో భక్తుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలి. భక్తుల రద్దీకి తగిన విధంగా ఆలయ ప్రాంగణంలో క్యూ లైన్ల నిర్వహణ ఉండాలి. క్యూ లైన్లపైనా, ఆలయ పరిసరాల్లోనూ సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. భక్తుల రద్దీకి తగిన విధంగా తాత్కాలిక మరుగు దొడ్లు ఏర్పాటు చేయడం, చెత్త పేరుకుపోకుండా పారిశుధ్య నిర్వహణను స్థానిక సంస్థల యంత్రాంగం చేపట్టాలి.
భక్తుల రద్దీకి తగిన విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలి. రద్దీ సమయాల్లో ఆయా క్షేత్రాల మీదుగా వెళ్లే జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలను క్రమబద్దీకరిస్తూ ప్రమాదాలకు తావులేకుండా తగిన చర్యలు తీసుకోవాలి. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఆలయాల దగ్గర మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలి” అన్నారు.
