జాతీయ పాల దినోత్సవం – పాల ద్వారానే సంపూర్ణ పోషణ సాధ్యం
జాతీయ పాల దినోత్సవం – పాల ద్వారానే సంపూర్ణ పోషణ సాధ్యం
రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, సంచాలకులు డా. టి. దామోదర్ నాయుడు
రాష్ట్ర పశు సంవర్ధక శాఖ పశుపోషకుల ప్రయోజనార్ధం, అధిక పశూత్పత్తులను పొందడానికి రైతు సేవా కేంద్రాల ద్వారా పశుపోషకుని ఇంటివద్దే పశు వైద్యం, పశుగ్రాస భద్రతా విధానం, దాణా మరియు పశుగ్రాస అభివృద్ధి కార్యక్రమాలు, జన్యు పరంగా అత్యుత్తమ నిర్మాణం గల పశుజాతుల అభివృద్ధి, ఉచిత పశు ఆరోగ్య శిబిరాల నిర్వహణ, గర్భకోస వ్యాదుల చికిత్సా శిబిరాలు, లింగ నిర్ధారిత వీర్య నాళికలు పంపిణీ, పశు బీమా, సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలు, గోకులాలు, పశు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ వంటి పథకాలు అమలు చేస్తూ మేలు రకపు పశుగణాన్ని వృద్ధి చేయడమే కాకుండా అధిక పశూత్పత్తులను ఉత్పత్తి చేయడం జరుగుతోందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, సంచాలకులు డా. టి. దామోదర్ నాయుడు ఒక ప్రకటనలో మంగళవారం తెలియజేసారు.
•పాడి పంటలు గ్రామీణ జన జీవనంలో గౌరవానికి, హోదాకు చిహ్నంగా భావించడం జరుగుతుంది. మానవ నాగరికత పరిణామ క్రమంలో పశువుల పెంపకం, పాడి చేయడం ప్రముఖ పాత్ర వహించాయి. పాలు అనేది మన వ్యవసాయ రంగంలోనే అతిపెద్ద ఆదాయ వనరు. ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థకు 5 శాతం వరకు తోడ్పాటును అందించడంతో పాటు, దేశంలో 8 కోట్లు పైగా రైతులకు నేరుగా ఉపాధి అందించడం జరుగుతోంది.
•మన దేశం ప్రపంచంలోనే అత్యధిక పశువులను కలిగి అధిక పాలు ఉత్పత్తి చేసే దేశం. మొత్తం ప్రపంచ పాల ఉత్పత్తిలో 24.64% మన దేశం నుండే ఉత్పత్తి జరుగుతోంది. గత తొమ్మిది సంవత్సరాలలో దేశంలోని పాల ఉత్పత్తి 58% మేర పెరుగుదలను నమోదు చేయడం జరిగింది
•పాలను, పాడి పరిశ్రమ విశిష్టతను పరిగణలోకి తీసుకొని పశుపోషకులకు మరింత అవగాహన కల్పించడానికి, పాల లభ్యతను పెంచడానికి, పాడి పరిశ్రమను మరింత ప్రోత్సహించడానికి, క్షీర విప్లవ పిత డా. కురియన్ గారి జన్మదినమైన నవంబర్ 26వ తేదీన భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాతీయ పాల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతోంది.
•దేశంలో మన రాష్ట్రం 139.46 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తితో 7వ స్థానంలో ఉంది, మన రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రైతులు పశుపోషణపై ఆధారపడి జీవనోపాదిని పొందుతున్నారు.
•మన రాష్ట్రం ప్రస్తుత పాలు మరియు పాల ఉత్పత్తుల విలువ ₹713.9 బిలియన్ ఉండగా, దీనిని 2033 నాటికి రెండింతలు పెంచేందుకు వివిధ వినూత్నమైన రాయితీ పథకాలను అమలుచేయడం జరుగుతోంది.
•21వ అఖిల భారత పశుగణ పశుగణన (2025) ప్రకారం మన రాష్ట్రంలో 46 లక్షల ఆవు జాతి పశువులు ( దేశంలో 14వ స్థానం) మరియు 62.19 లక్షల గేదె జాతి పశువులు (దేశంలో 6 వ స్థానం) ఉన్నాయి.
•2024-25 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర పాల ఉత్పత్తి 139.46 లక్షల టన్నులగా ఉంది. 2033 సంవత్సరనాటికి పాల ఉత్పత్తిని 150 లక్షల టన్నులు సాధించి, 15% వృద్ధిరేటుతో దేశంలోనే మొదటి మూడు స్థానాలలో ఉండాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది.
•మన రాష్ట్రంలో ఒక్కొక్క వ్యక్తి సగటు పాల వినియోగం రోజుకు సుమారు 719 గ్రాములుగా ఉంది. ఇది దేశ సగటు రోజువారీ పాల వినియోగం సుమారు 459 గ్రాముల కంటే చాలా ఎక్కువగా ఉంది.
