Cricket: క్రికెట్ ఇక జెంటిల్మన్ గేమ్ కాదు.. హర్మన్‌ప్రీత్ వైరల్ పోస్ట్
Cricket: క్రికెట్ ఇక జెంటిల్మన్ గేమ్ కాదు.. హర్మన్‌ప్రీత్ వైరల్ పోస్ట్
ముంబై, నవంబర్ 3 (పీపుల్స్ మోటివేషన్):-
భారత మహిళల క్రికెట్ జట్టు చిరకాల స్వప్నాన్ని సాకారం చేసింది హర్మన్‌ప్రీత్ కౌర్. పదహారేళ్ల కెరీర్లో ఎన్నో ఆటుపోట్లు, వరల్డ్ కప్ ఓటములను ఎదుర్కొన్న ఆమె చివరకు స్వదేశంలోనే మహా విజయాన్ని అందుకుంది. మహిళా క్రికెట్‌లో సువర్ణయుగానికి నాంది పలికిన ఈ కెప్టెన్ నాయకత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్నప్పటి నుంచీ క్రికెట్టే శ్వాసగా బతికిన హర్మన్‌ప్రీత్ వరల్డ్ కప్ విజయానంతరం విమర్శకులకు పరోక్షంగా సమాధానమిచ్చింది.
‘క్రికెట్ అనగానే జెంటిల్మన్ గేమ్’ అనే మాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అయితే, ఈ మాటకు ఇక అర్ధమే లేదని హర్మన్‌ప్రీత్ తన తాజా పోస్ట్‌తో స్పష్టంచేసింది. వరల్డ్ కప్ ట్రోఫీని కౌగిలించుకుని నిద్రిస్తున్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె ధరించిన టీషర్ట్‌పై “క్రికెట్ అనేది జెంటిల్మన్ గేమ్” అనే వాక్యం కొట్టేసి, దాని కింద “ప్రతిఒక్కరి ఆట” అని రాసి ఉంది.
ఈ ఒక్క ఫోటో ద్వారానే ‘క్రికెట్ అనేది కేవలం పురుషుల ఆట కాదు, మహిళలదీ అదే సమాన హక్కు ఉన్న రంగం’ అనే సందేశాన్ని హర్మన్‌ప్రీత్ ఘాటుగా చెప్పింది. మహిళా క్రికెటర్లు కూడా అద్భుతాలు చేయగలరని, ఇకనైనా వారిని చిన్నచూపు చూడరాదని ఆమె తన స్టైల్లో స్పష్టం చేసింది. ఆదివారం దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో టీమిండియా చరిత్ర సృష్టించింది. తొలిసారిగా వన్డే వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టును కెప్టెన్‌గా విజయపథంలో నడిపిన హర్మన్‌ప్రీత్ దేశానికి మూడో వరల్డ్ కప్‌ను అందించిన కెప్టెన్‌గా చరిత్రకెక్కింది. విజయానంతరం ఆమె 2011 విజేత ధోనీ తరహాలో గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ట్రోఫీతో ఫొటోలకు పోజిచ్చి అభిమానుల హృదయాలు దోచుకుంది.
