Pulicat lake: పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం
Pulicat lake: పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం
— ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
పులికాట్ సరస్సు మరోసారి శీతాకాలపు సౌందర్యంతో కళకళలాడుతోంది. దూర దేశాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే సైబీరియన్ పక్షులు, ఫ్లెమింగోలు, ఈసారి కూడా పులికాట్ తీరాలకు చేరి కనువిందు చేయడం ప్రారంభించాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకలుగా నిలిచే ఈ పక్షులు అక్టోబర్‌లో వచ్చి మార్చి వరకు ఇక్కడే నివసిస్తాయి. వీటి రాక సందర్భంగా ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే ‘ఫ్లెమింగో ఫెస్టివల్’ రాష్ట్ర పర్యాటక రంగానికి విశేష ఆకర్షణగా మారింది.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పులికాట్‌ను ఎకో టూరిజం గమ్యస్థానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఫ్లెమింగోల శాశ్వత నివాసానికి అనువైన పరిస్థితులు సృష్టించేందుకు అటవీ శాఖ కృషి చేస్తోందని వివరించారు. ఆహారం, నీరు, భద్రత, విశ్రాంతి స్థలాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినందున, ఇటీవల ఫ్లెమింగోలు ఏడాది పొడవునా ఇక్కడే ఉంటున్నాయని తెలిపారు.
మొంథా తుఫాను ప్రభావం నుంచి ఫ్లెమింగో స్థావరాలను రక్షించేందుకు ముందుగానే ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, రాబోయే మూడు నెలల్లో పక్షుల రక్షణపై అటవీ శాఖ మరింత జాగ్రత్త వహించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
ఎకో టూరిజం విస్తరణలో భాగంగా ఫోటోగ్రఫీ, బర్డ్ సీయింగ్, ఎకో క్లబ్‌లు వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. “పులికాట్‌ను ఫ్లెమింగోల శాశ్వత నివాస స్థావరంగా, అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడం మన లక్ష్యం. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యం, గ్రామీణ ఆర్థికాభివృద్ధి అన్నింటికీ దోహదం చేసే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తాం” అని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
