రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వైకల్యాన్ని అధిగమించి మీరు సాధించిన విజయం అపూర్వం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

వైకల్యాన్ని అధిగమించి మీరు సాధించిన విజయం అపూర్వం

• మీ విజయం చూసి దేశం గర్విస్తోంది

• వైక్యలాన్ని ఎదిరించి కప్పు సాధించిన అంధ మహిళా క్రికెటర్ తనకు ఇల్లు కూడా లేదని చెప్పడం కదిలించింది

• ఈ విజయం మీ జీవితాల్లో వెలుగులు నింపాలి

• దివ్యాంగులకే కాదు... ప్రతి ఒక్కరికీ ఈ విజయం స్ఫూర్తిదాయకం 

• అంధ క్రికెటర్లకు అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరతా

• ప్రపంచ కప్ విజేతగా నిలిచిన మహిళల అంధ క్రికెట్ జట్టుని సత్కరించిన ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ 

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

“మన దేశానికి చెందిన అంధ మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలించిందని మాధ్యమాల్లో చూసి ఆశ్చర్యపోయాను. అదే సందర్భంలో మరొక విషయం కదిలించింది... వైక్యలాన్ని ఎదిరించి కప్పు సాధించిన అంధ మహిళా క్రికెటర్ తనకు ఇల్లు కూడా లేదని చెప్పడం చూశాను. ఇంతటి విజయంలో భాగస్వామి అయిన ప్రతిభావంతురాలి వేదన కదిలించింది. ఈ జట్టుకి నా వంతు ప్రోత్సాహం, భరోసా ఇవ్వాలని భావించాను. వైకల్యాన్ని అధిగమించి చూపునకు నోచుకోని మహిళా బృందం సాధించిన విజయం అపూర్వం. మీ విజయంతో మీలాంటి ఎందరికో ఓ మార్గం చూపారు. అంధత్వం అడ్డంకిగా కాకుండా ఓ సవాలుగా స్వీకరించి దేశం గర్వపడే విజయం అందించారు. మీరు సాధించిన ఈ విజయంతో ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగింది. ఈ విజయం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపుతుంద”ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ప్రపంచ కప్ గెలిచిన మహిళల అంధ క్రికెట్ జట్టును సత్కరించారు. ఒక్కో క్రికెటర్ కు తనవంతు ప్రోత్సాహకంగా రూ. 5 లక్షల చొప్పున బహూకరించారు. సహాయక సిబ్బందికి రూ. 2 లక్షల చొప్పన… మొత్తం రూ. 84 లక్షలు అందజేశారు. అంధ క్రికెటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం  పవన్ కళ్యాణ్  మాట్లాడుతూ “అంధ మహిళా క్రికెటర్లు చూపిన అంకిత భావం, పడిన కష్టం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. వారు సాధించిన విజయం భారత క్రీడా చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుంది. వీరు సాధించిన విజయం చూసి దివ్యాంగులెవరూ తమకున్న వైకల్యం పట్ల బాధపడకుండా చేశారు. దివ్యాంగులకే కాదు ప్రతి ఒక్కరికీ వీరి విజయం స్ఫూర్తినిస్తోంది. అకుంఠిత దీక్షతో ఒక పెద్ద విజయం సాధిస్తే దాని వెనుక పేరు ప్రతిష్టలు వాటంతటవే వస్తాయి. ఈ విజయం మీ జీవితాల్లో వెలుగులు నింపాలి. 

• దీపిక గ్రామానికి రోడ్డు.. కరుణకుమారికి ఇల్లు.. 

ఈ విజయం తాలూకు గుర్తింపు మీకు దక్కాలి. మీ జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలి. మన రాష్ట్ర క్రికెటర్ల అంశాన్ని  ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు  దృష్టికి తీసుకువెళ్లి చేయగలిగినంత చేస్తాను. ఇందుకు అవసరం అయితే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా కార్పోరేట్ల సాయం కూడా తీసుకుంటాం. అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తాను. 

జట్టుకు సారథ్యం వహించిన కెప్టెన్ దీపిక తన జట్టులో ప్రతి ఒక్కరి కష్టాన్ని వివరించింది.  సత్యసాయి జిల్లాకు చెందిన దీపిక ఆట కోసం పడిన కష్టంతో పాటు తన ఊరికి అవసరం అయిన సదుపాయాల గురించి మాట్లాడి సామాజిక స్పృహని చాటుకున్నారు. ఆమె గ్రామానికి రోడ్డు మంజూరు చేస్తున్నాం. అలాగే అల్లూరి జిల్లాకి చెందిన క్రికెటర్ కరుణ కుమారికి ఇల్లు మంజూరు చేసి కట్టించి ఇవ్వాలని అధికారులకు సూచిస్తున్నాను” అన్నారు.   

• ఘన సత్కారం

ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  తన విశాల హృదయాన్ని, మానవీయ స్పందనను మరోసారి చాటుకున్నారు. ప్రతి మహిళా క్రికెటర్ కీ రూ. 5 లక్షలు చెక్కు అందించారు. పట్టు చీర ప్రదానం చేసి శాలువాతో సత్కరించారు. ఆంధ్ర ప్రదేశ్ హస్త కళకు సంబంధిచిన జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీ డబ్బాలతో కూడిన బహుమతి ప్యాక్ అందించారు. సత్కారం అయ్యాక ప్రతి క్రీడాకారిణినీ ఆమె కుర్చీలో జాగ్రత్తగా కూర్చోబెట్టి, మరో క్రీడాకారిణికి సత్కారం చేశారు.

• మ్యాచ్ ఫీజుతో అమ్మానాన్నల కడుపు నిండుతుందనే ఆడేవాళ్లం : దీపిక (శ్రీ సత్యసాయి జిల్లా), జట్టు కెప్టెన్ 

“ప్రపంచకప్ గెలిచిన జట్టులోకి 16 మంది అమ్మాయిలు చాలా కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చాం. మా కుటుంబాలకు ఒక్క పూట కడుపు నింపుకునేందుకు కూడా కష్టంగా ఉండేది. మాలో చాలా మంది అమ్మాయిలు క్రికెట్ ఆడితే మ్యాచ్ ఫీజు వస్తుందనే ఆడేవాళ్లం. మ్యాచ్ ఫీజుతో మా అమ్మానాన్నల కడుపు నింపవచ్చనే ఆడుతున్నాం. ప్రభుత్వం నుంచి మాకు సరైన సాయం అందితే అమ్మానాన్నలను బాగా చూసుకుంటాం. మాది సత్యసాయి జిల్లా, హేమవతి పంచాయతీ పరిధిలోని తంబలహట్టి తండా. మా గ్రామానికి సరైన రహదారి సౌకర్యం కూడా లేదు. రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఊరికి రోడ్డు వేయించండి” అని భారత అంధ మహిళా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన దీపిక కోరారు.

• విజయం తర్వాత కూడా సరైన గౌరవం దక్కడం లేదు : అనూ కుమారి, ఢిల్లీ క్రికెటర్

“క్రికెట్లోకి రాక ముందు మాకు పూట గడవడానికి కూడా కష్టంగా ఉండేది. ఈ రోజున ఇంత విజయం సాధించిన తర్వాత కూడా సరైన గౌరవం దక్కడం లేదు. సాధారణ క్రికెటర్ల మాదిరి ప్రోత్సాహకాలు అందిస్తే మేము మరిన్ని విజయాలు సాధిస్తాం. మాకు ప్రాక్టీస్ చేయడానికి సాధారణ గ్రౌండ్లు పనికి రావు. బంతి శబ్దం స్పష్టంగా వినబడడానికి వీలుగా సౌకర్యాలు ఉండాలి. మేమంతా దూరంగా అడవుల మధ్య ఉన్న మైదానాలకు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాళ్లం. ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక కోచ్, సౌకర్యాలు, ఆర్థిక భరోసా ఉంటే మేము మరిన్ని విజయాలు సాధిస్తామ”ని ఢిల్లీకి చెందిన క్రికెటర్ అనూ కుమారి తెలిపారు.

•మ్యాచ్ ఫీజులతో ఇంటిని నడుపుతున్నాం : అనేఖా దేవి, జమ్మూకశ్మీర్ క్రికెటర్

“మాది జమ్మూకశ్మీర్. నేను రెండేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాను. జమ్మూకశ్మీర్ కి ప్రత్యేక క్రికెట్ బోర్డు లేకపోవడంతో ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా తండ్రి విద్యుత్ సంస్థలో ఉద్యోగిగా పని చేసేవారు. కొంతకాలంగా ఆయన ఆనారోగ్యం బారినపడడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. మ్యాచ్ ఫీజులతో ఇంటిని నడుపుకొనే అవకాశం దక్కింది. ఇలా ప్రోత్సాహం లభిస్తే ఆర్థిక ఇబ్బందులు తీరి ఆటపై మరింత దృష్టా సారించే అవకాశం ఉంటుంది” అని అనేఖా దేవి తెలిపారు.

• అంధ క్రికెటర్లకు మీ భరోసా కావాలి : ఐ. అజయ్ కుమార్ రెడ్డి, అంధ సీనియర్ క్రికెటర్, అర్జున అవార్డుగ్రహీత

“సరైన సదుపాయాలు కల్పిస్తే ఏం చేయగలమో మహిళల అంధ క్రికెట్ జట్టు మరోసారి చేసి చూపింది. ఈ రోజున దేశం మొత్తం జట్టుకి సెల్యూట్ కొడుతుంటే సంతోషంగా ఉంది. ఇలాంటి గుర్తింపే మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఏ సమస్య తీసుకున్నా పరిష్కరించే వరకు వదిలిపెట్టరన్న నమ్మకం మాకుంది. మీ వల్లే ఉద్దానం సమస్య వెలుగులోకి వచ్చింది. మీ వల్లే ఈ రోజున గ్రామాల్లో రోడ్లు పడుతున్నాయి. సంపాదన కోసం కాకుండా ప్రజాసేవే పరమావదిగా పని చేసే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. మీరు అంధ క్రికెటర్ల పక్షాన నిలిస్తే ప్రభుత్వం తరఫున మాకు భరోసా లభిస్తుంది. గతంలో అంధ క్రికెట్ జట్టుకి మీరు సాయం చేశారు. రణస్థలంలో రూ. 50 వేల చొప్పున నలుగురు క్రికెటర్లకు ఇచ్చార”ని సీనియర్ క్రికెటర్, అర్జున అవార్డు గ్రహీత ఐ. అజయ్ కుమార్ రెడ్డి చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఏసీఏ ఉపాధ్యక్షులు బండారు నరసింహారావు, ఏసీఏ మాజీ వైస్ ప్రెసిడెంట్ పి.వి.ఆర్. ప్రశాంత్, క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఇండియా ఛైర్మన్ మహంతేష్ జి. కివదాసన్నవర్, జట్టు మేనేజర్  శిఖా శెట్టి, క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఏపీ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-