అటవీ మార్గాల్లో వన్యప్రాణుల ప్రమాదాలు నివారణకు కట్టుదిట్టమైన చర్యలు
అటవీ మార్గాల్లో వన్యప్రాణుల ప్రమాదాలు నివారణకు కట్టుదిట్టమైన చర్యలు
• వేర్వేరు ఘటనల్లో ఆడ పులి, చిరుత మృతి చెందడం దురదృష్టకరం
• రెండు ఘటనలపై తక్షణం విచారణ జరిపి నివేదిక ఇవ్వండి
• అటవీశాఖ అధికారులను ఆదేశించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్
‘పర్యావరణ సమతులతలో వన్య ప్రాణుల సంరక్షణ ప్రధాన అంశం. వన్యప్రాణుల రక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరించాలి. ముఖ్యంగా అటవీ మార్గాల వెంట ప్రయాణించే వాహనదారులు మరింత బాధ్యతగా వ్యవహరించాల’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. మంగళవారం ప్రకాశం జిల్లా, మార్కాపురం అటవీ డివిజన్ పరిధిలో వాహనం ఢీకొని ఆడ పులి, ఆదోని రేంజ్ లో రైలు ఢీకొని చిరుత మృతి చెందిన ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ప్రమాదాలపై తక్షణం విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని అటవీశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అటవీ సరిహద్దు మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మంగళవారం వేర్వేరు ఘటనల్లో ఆడ పులి, చిరుత మృతిపై అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఒకే రోజు రెండు ప్రమాదాల్లో పులి, చిరుత ప్రాణాలు కోల్పోవడం బాధించింది. అడవులు, వన్యప్రాణి సంచార మార్గాలకు సమీపంగా ఉన్న జాతీయ రహదారులు, రైల్వే లైన్ల వద్ద ప్రమాదాల నివారణకు మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హైవే అథారిటీ, రైల్వే, పోలీస్ శాఖలతో పాటు జిల్లా యంత్రాంగం సమన్వయంతో చర్యలు చేపట్టాలి.
• హాట్ స్పాట్స్ గుర్తించండి
తరచు వన్యప్రాణులు ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, రంబుల్ స్ట్రిప్స్, బ్యారికేడ్లు, సోలార్ బ్లింకర్లు ఏర్పాటు చేయాలి. అటవీ మార్గాల సమీపంగా వెళ్లే రహదారుల వెంబడి రాత్రి సమయాల్లో వాహనాల వేగంపై పరిమితులు విధించి నిబంధనలు కఠినంగా అమలు చేయాలి. స్పీడ్ గన్లు, ఏఐ ఆధారిత సీసీ కెమెరాలు వినియోగించి పరిమితికి మించి వేగంతో వెళ్లే వాహనాలపై జరిమానాలు విధించాలి. రాత్రి వేళల్లో గస్తీ పెంచాలి. వన్యప్రాణుల సంచారం, రక్షణపై వాహనదారులు, స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించాల”న్నారు.
