సంక్షేమ బాలుర వసతి గృహం నిర్వహణ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
సంక్షేమ బాలుర వసతి గృహం నిర్వహణ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
వార్డెన్ గోపాల్, వాచ్మెన్ రామయ్య ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి
అసిస్టెంట్ బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ కు షో కాజ్ నోటీస్ జారీ
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, డిసెంబర్ 23 (పీపుల్స్ మోటివేషన్):- వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ సమీకృత బాలుర వసతి గృహం నిర్వహణ పట్ల జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. వసతి గృహంలో సక్రమంగా భోజనం అందించినందుకు వార్డెన్ గోపాల్, విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిసున్నందుకు వాచ్మెన్ రామయ్య ల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, పర్యవేక్షణ సక్రమంగా చేయని అసిస్టెంట్ బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీనివాస్ కు షో కాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి బీసీ సంక్షేమ అధికారిని ఆదేశించారు .
మంగళవారం కోసిగి మండల కేంద్రంలోని వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ సమీకృత బాలుర వసతి గృహ సముదాయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముందుగా పిల్లలతో మాట్లాడుతూ భోజనం ఏ విధంగా ఉంటోంది, మెనూ ప్రకారం రోజు ఏ భోజనం అందిస్తున్నారో తెలుసా అని పిల్లలను ఆరా తీశారు..మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, చికెన్ తక్కువ పరిమాణం లో ఇస్తున్నారని, అరటిపండు ఇవ్వడం లేదని, ఆదివారం రోజు టిఫిన్ చాలా ఆలస్యంగా పెడతారని, బాత్రూమ్ లు శుభ్రంగా ఉండవని, లైట్, ఫ్యాన్ లు సరిగా పని చేయవని, డార్మిటరి డోర్ లు, విండో లు ఊడిపోయే స్థితిలో ఉన్నాయని, వాచ్మెన్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు..
కలెక్టర్ డార్మిటరీ ని పరిశీలిస్తూ లైట్, ఫ్యాన్ లు సరిగా పని చేయడం లేదని గమనించారు. అలాగే డార్మిటరి డోర్ లు, విండో లు ఊడిపోయే స్థితిలో ఉన్నట్లు, టాయిలెట్ లు అశుభ్రంగా, దుర్వాసన వస్తున్నట్లు గమనించి, బీసీ సంక్షేమ శాఖ అధికారి తో ఫోన్ లో మాట్లాడి, రేపు వచ్చి వాటిని వెరిఫై చేసి వారం రోజుల్లో మరమ్మతులు చేయించి తనకు ఫోటో లను పంపించాలని కలెక్టర్ బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు..
అనంతరం కలెక్టర్ వంట గదిని పరిశీలిస్తూ మెనూ ప్రకారం విద్యార్థులకు ఎందుకు భోజనం అందించడం లేదని, ఇదే స్థానంలో మీ పిల్లలు ఉంటే ఇదే విధంగా చేస్తారా? పిల్లలకి ఇచ్చే పాలలో నీటిని అధికంగా కలిపి ఇస్తారా, చికెన్ కొంచెమే పెట్టడం ఏంటని, అరటిపండు ఎందుకు ఇవ్వడం లేదని కలెక్టర్ వంట సిబ్బంది పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు... సంబంధిత వంట సిబ్బందిని వెంటనే మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఫోన్ ద్వారా బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు...నిర్లక్ష్యానికి బాధ్యులైన వార్డెన్ గోపాల్ ను రీప్లేస్ చేసి అతని మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని, పిల్లలతో దురుసుగా ప్రవర్తిసున్న వాచ్ మెన్ రామయ్య ను టెర్మినేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అదే విధంగా పర్యవేక్షణలో విఫలమైన అసిస్టెంట్ బీసీ సంక్షేమ శాఖ అధికారికి షో కాజ్ నోటీస్ లు జారీ చేయాలని కలెక్టర్ మొబైల్ ఫోన్ ద్వారా బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు..
వసతి గృహం వెనుక వైపు డ్రైనేజ్ వాటర్ నిల్వ ఉందని, వెంటనే క్లీన్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిపిఓ ను ఆదేశించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహాల నిర్వహణలో ఎలాంటి అలసత్వం సహించబోమని, విద్యార్థుల భద్రత, సంక్షేమం పట్ల అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.. లేని యెడల సంబంధిత అధికారులు కఠినమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో డీపీఓ భాస్కర్, కోసిగి తహసిల్దార్ వేణుగోపాల్ స్వామి, ఎంపిడిఓ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

