గృహ నిర్మాణాలలో వేగం పెంచి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి
గృహ నిర్మాణాలలో వేగం పెంచి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు, డిసెంబర్ 23 (పీపుల్స్ మోటివేషన్):- ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ పథకాలను వేగవంతంగా అమలు చేసి, ఇళ్ళ నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
మంగళవారం కోసిగి మండలంలోని నేల కోసిగి గ్రామంలో ఏర్పాటు చేసిన హౌసింగ్ లేఅవుట్‌ను కలెక్టర్ క పరిశీలించి, గృహ నిర్మాణాల పురోగతిపై సంబంధిత అధికారులు, లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న నిర్మాణ పనులను గురించి వివరంగా తెలుసుకున్నారు.
గ్రామంలో మొత్తం 71 గృహాలు మంజూరు కాగా, వాటిలో 59 గృహాలు బేస్‌మెంట్ స్థాయికి చేరుకున్నాయని, 3 గృహాలు రూఫ్ లెవెల్‌లో ఉండగా, 5 గృహాలు ఆర్‌సి స్థాయిలో ఉన్నాయని తెలిపారు. మిగిలిన గృహాల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసి, ప్రభుత్వం నిర్దేశించిన గడువులో పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే హౌసింగ్ కాలనీలో లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు కల్పించాలన్నారు. ముఖ్యంగా వీధి దీపాల ఏర్పాటు, రహదారులు, తాగునీరు, డ్రెయినేజ్ వంటి ప్రాథమిక సదుపాయాలను సమయానుకూలంగా పూర్తిచేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
తదనంతరం ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసుకున్న లబ్ధిదారుడు బసన్న గౌడ్ గృహాన్ని కలెక్టర్ సందర్శించి, నిర్మాణ నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వ సహకారంతో సొంత ఇంటి కల నెరవేరిందని లబ్ధిదారుడు తెలియజేయగా, కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చిరంజీవి, డిపిఓ భాస్కర్ , తాసిల్దార్ వేణుగోపాల్ శర్మ, ఎంపీడీవో మహబూబ్ భాషా, హౌసింగ్ డిప్యూటీ ఇంజినీర్ లాల్ స్వామి, ఏ.ఈ స్వరూప్, గ్రామీణ నీటి పారుదల శాఖ తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.
