కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు రూ.83 లక్షల చెక్కుల పంపిణీ
కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు రూ.83 లక్షల చెక్కుల పంపిణీ
- సీఎం సహాయ నిధి ద్వారా 31 కుటుంబాలకు ఆర్థిక భరోసా
- బాధితులకు ప్రభుత్వం సంపూర్ణ అండ
మల్యాల, జనవరి 9 (పీపుల్స్ మోటివేషన్):
మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన 31 బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.83 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొని బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, లక్షలాది రూపాయలు అప్పులు చేసి సామాగ్రి తెచ్చుకున్న చిరు వ్యాపారులు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన దుస్థితిని చూసి ప్రజా ప్రభుత్వం తక్షణమే స్పందించిందన్నారు. ప్రమాదాన్ని వెంటనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, జిల్లా అధికారుల ద్వారా సమగ్ర నివేదిక సమర్పించామని తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధి నుంచి రూ.83,12,000, విద్యుత్ సంస్థ నుంచి రూ.29 లక్షలు, డీఆర్‌డీఓ ద్వారా మరో రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించడం సంతోషకరమన్నారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారు తిరిగి వ్యాపారాలు ప్రారంభించేలా ప్రభుత్వం భవిష్యత్తులోనూ పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
అలాగే రాజరాజేశ్వర స్వామి దేవాలయం, కొండగట్టు, ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాలను టెంపుల్ సిటీ కారిడార్‌గా అభివృద్ధి చేస్తామని, కొండగట్టు గిరి ప్రదక్షిణ మార్గం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం మాట్లాడుతూ, కొండగట్టు ప్రాంతంలో చిరు వ్యాపారాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కుటుంబాలు అగ్ని ప్రమాదంతో తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. వారి పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం బాధితులను ఆదుకుందని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం భారీ నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదించామని చెప్పారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో బాధిత వ్యాపారులు తిరిగి తమ జీవనోపాధిని ప్రారంభించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ వారి వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీఆర్‌డీవో రఘువరన్, ఎమ్మార్వో, ఎంపిడివోతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
