కాల్ ఫార్వార్డ్ స్కామ్‌తో జాగ్రత్త
కాల్ ఫార్వార్డ్ స్కామ్‌తో జాగ్రత్త
- 21 మొబైల్ నంబర్ డయల్ చేస్తే మోసం
- అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్, జనవరి 9 (పీపుల్స్ మోటివేషన్):
కాల్ ఫార్వార్డింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీస్ హెచ్చరించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి “పార్సెల్, డెలివరీ, ఆఫర్, బ్యాంక్ అప్‌డేట్” వంటి కారణాలు చెప్పి బాధితులను మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ స్కామ్‌లో భాగంగా మీ కాల్ ఫార్వార్డింగ్‌ను మీకు తెలియకుండానే ఆన్ చేసేలా 21 నంబర్‌ను డయల్ చేయమని చెప్పి మోసానికి పాల్పడుతున్నారు. ఒకసారి కాల్ ఫార్వార్డింగ్ యాక్టివ్ అయితే, మీకు వచ్చే కాల్స్, ఓటీపీలు, బ్యాంక్ సమాచారం మోసగాళ్లకు చేరే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు.
డెలివరీ పర్సన్, కాల్ సెంటర్ అంటూ నమ్మించి సూచించిన నంబర్లు డయల్ చేయవద్దని, అనుమానాస్పద కాల్స్‌కు స్పందించవద్దని తెలిపారు. మీకు తెలియకుండానే కాల్ ఫార్వార్డింగ్ ఆన్ అయ్యిందని అనిపిస్తే వెంటనే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆఫ్ చేయాలని సూచించారు.
సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ఎవరికైనా ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, ఫోన్ సెట్టింగ్స్‌కు సంబంధించిన సమాచారం ఇవ్వకూడదని, ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని తెలంగాణ పోలీసులు ప్రజలకు సూచించారు.
