నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సందర్శించిన హరీష్‌రావు
నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సందర్శించిన హరీష్‌రావు
- కేసీఆర్ కలలు నేడు నిజమయ్యాయి
- కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు
సిద్దిపేట, జనవరి 9 (పీపుల్స్ మోటివేషన్):
సిద్దిపేట జిల్లాలోని నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిద్దిపేట నియోజకవర్గం పూర్తిస్థాయిలో నూనె ఉత్పత్తి ప్రారంభించడం ఆనందకరమని అన్నారు. ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలలు నేడు నిజమైన సందర్భమని పేర్కొన్నారు.
రైతులకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎన్నో చారిత్రక కార్యక్రమాలు అమలయ్యాయని హరీష్‌రావు గుర్తుచేశారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ రైతుబంధు పథకాన్ని ఆపలేదని, రైతులకు నీళ్ల బాధ లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, ఎరువులు, విద్యుత్ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని తెలిపారు.
అయితే రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైందని విమర్శించారు. రైతులకు రోజుకు పన్నెండు గంటలకు మించి కరెంట్ రావడం లేదని, యూరియా కోసం యాప్‌లు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. వానాకాలం పంటకు రూ.600 కోట్ల బోనస్ పెండింగ్‌లో పెట్టారని, రెండు పంటలకు రైతుబంధు ఎగ్గొట్టారని మండిపడ్డారు. రెండేళ్లుగా పంటల బీమా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే సిద్దిపేట జిల్లాలో వరి సాగు విస్తీర్ణం 8 వేల ఎకరాల నుంచి 80 వేల ఎకరాలకు పెరిగిందని హరీష్‌రావు చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో ఒక్క గజం కాలువ కూడా తవ్వలేదని, కావాలని రైతులపై కక్షతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పట్ల చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు.
ఆయిల్‌పామ్ ప్రాజెక్టు వివరాలను వెల్లడిస్తూ, 2021 మార్చి 25న క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నామని, జూన్ 5, 2021న అశ్వారావుపేట నుంచి మొక్కలు తెచ్చి నాటినట్లు తెలిపారు. నేడు జిల్లాలో 14,075 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు కొనసాగుతోందని, నర్మెటలో 65 ఎకరాల్లో రూ.300 కోట్లతో 2022 ఏప్రిల్ 13న ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం రోజుకు 3,500 గెలలను క్రషింగ్ చేస్తున్నామని, 600 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అవుతోందని చెప్పారు. త్వరలోనే రిఫైనరీ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్‌రావు ఆరోపించారు. సిద్దిపేట నియోజకవర్గంలోనే 22 వేల మంది రైతులకు ఇప్పటికీ రుణమాఫీ కాలేదని తెలిపారు. రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీ ప్రారంభానికి వస్తే, 22 వేల మంది రుణమాఫీ కాని రైతులతో కలిసి వచ్చి ప్రశ్నిస్తానని హెచ్చరించారు. రుణమాఫీ పూర్తయ్యే వరకు రైతులతో అక్కడే కూర్చుంటానని స్పష్టం చేశారు.
ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. అశోక్‌నగర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే అక్కడికి వెళ్లాలని హరీష్‌రావు సవాల్ విసిరారు.

