పీఠికాపురాన ముందస్తు సంక్రాంతి కాంతులు
పీఠికాపురాన ముందస్తు సంక్రాంతి కాంతులు
• మూడు రోజుల వేడుకలకు శ్రీకారం చుట్టిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
• అచ్చ తెలుగు సంస్కృతిని ఆవిష్కరించిన సంక్రాంతి సంబరాలు
• ఆకట్టుకున్న జానపద కళారూపాలు, శాస్త్రీయ నృత్యరీతులు
• డప్పు శబ్దాలు, కొమ్ముకోయల ఆటలు.. గరగ నృత్యాలు, వీరనాట్య రీతులు, కోలాటాల సందళ్ల మధ్య సంబరం
• గోపూజలు చేసి, హరిదాసుల కీర్తనలు ఆస్వాదించిన పవన్ కళ్యాణ్
• సీమంతం, భోగి పళ్ల మహోత్సవాల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రివర్యులు
పీఠికాపురాన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రతి అడుగు తెలుగింటి సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడగా.. పల్లె పదాలు, ప్రగతి వీచికలు అన్ని ఒకే వేదికపై ఆవిష్కృతం కాగా... డప్పుల శబ్దాల సందళ్లు, పల్లె పడుచుల కోలాటాల కోలాహలం మధ్య స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ సహచర మంత్రులతో కలిసి పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట ఏర్పాటు చేసిన ముందస్తు సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. సంప్రదాయబద్దంగా గో ఆరాధన చేసి, రంగవల్లులు తీర్చిదిద్దిన హరివిల్లుల ముంగిట ప్రకృతికి పూజలు నిర్వహించారు. తెలుగు సంస్కృతికి అద్దం పట్టే జానపదుల గీతికలు, శాస్త్రీయ నృత్యాలను ఆహుతులతో కలిసి ఆస్వాదించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ను ప్రారంభించి మన హస్తకళల శైలిని పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్ , పొంగూరు నారాయణ , కందుల దుర్గేష్ పవన్ కళ్యాణ్ తో కలసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. పిఠాపురానికి సంక్రాంతిని ముందుగానే తెచ్చిన ఈ సంబరాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి.
హరిదాసు సంకీర్తనలు, మేళతాళాల మధ్య ఆటలాడే బసవన్నలు, గుండెలపై ధరించిన డప్పుల శబ్దాలతో చిందులేసే తప్పెటగుళ్ల కళాకారుల విన్యాసాలు, లయబద్దంగా సాగే గరగ నృత్యాలు, శాస్త్రీయ కూచిపూడి నృత్యాలు, చిన్నారుల భవితను కాంక్షించే భోగిపళ్ల మహోత్సవాలు, ప్రకృతికి జీవాన్నిచ్చే గోమాతల పూజలు, హస్త కళల సోయగాల మధ్య అచ్చ తెలుగు పండుగ సంక్రాంతికి పిఠాపురం నుంచి స్వాగతం పలికారు రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ . శుక్రవారం ఉదయం గం. 10.30 నిమిషాలకు పిఠాపురంకి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి శాస్త్రీయ కూచిపూడి నృత్యకళాకారులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు.
• థింసా కళాకారులతో పదం కలిపిన పవన్ కళ్యాణ్
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన కళారూపాలు తిలకిస్తూ పవన్ కళ్యాణ్ ముందుకు కదిలారు. ఆ కళా రూపాలు ఉప ముఖ్యమంత్రివర్యులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పల్లెపడుచుల కోలాటాలు, వీర నాట్యాలు, గిరిజన సంప్రదాయాలకు అద్దం పట్టే కొమ్ము కోయల సందళ్లు అడుగడుగునా స్వాగతం పలుకగా పవన్ కళ్యాణ్ కళాకారులతో మమేకమవుతూ.. ఆసక్తిగా తిలకిస్తూ కళాకారులను పేరు పేరునా పలుకరిస్తూ.. వారితో ఫొటోలు దిగుతూ ముందుకు సాగారు. ప్రతి సంప్రదాయం గురించి ఆరా తీస్తూ వారి కళాకారుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గిరిజన సంప్రదాయ నృత్యం థింసా కళాకారులతో కలిసి పదం కలిపి నృత్యం చేశారు.
• హరిదాసులకు స్వయంపాక దానం
సంక్రాంతి మహోత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇంటి ముంగిట రంగవల్లుల హరివిల్లులను తిలకిస్తూ, హరిదాసుల సంకీర్తనలు విన్నారు. సంప్రదాయబద్దంగా ధాన్యం, ధనం, కూరగాయలు, పండ్లతో కూడిన స్వయంపాక దానం చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీకృత వ్యవసాయ స్టాల్ ను పరిశీలించారు. వరితోపాటు విభిన్న జాతుల సిరిధాన్యాల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.
• రాట్నం వడుకుతూ..
చేనేత, జౌళి, చేతివృత్తులు, మహిళా, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పవన్ కళ్యాణ్ సందర్శించారు. చేనేత కళాకారులను పలుకరించి స్వయంగా రాట్నం వడికి, మగ్గాన్ని పరిశీలించారు. జౌళి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాలను స్టాళ్లను తిలకించారు. ఉప్పాడ చీరలు, కలంకారీ తదితర వస్త్రాల మీద అద్దిన కళలు పవన్ కళ్యాణ్ని ఆకట్టుకున్నాయి. నేతన్నలు ప్రత్యేకంగా రూపొందించిన కోటును ధరించి వారిని ఉత్సాహపరిచారు. తోలు బొమ్మల కళాకారులతో ముచ్చటించారు. లేపాక్షి స్టాల్ లో శ్రీనివాసుని ప్రతిమలను తిలకించారు. అనంతరం గర్భిణి స్త్రీలకు పవన్ కళ్యాణ్ శ్రీమంతం వేడుక నిర్వహించారు. అదే స్టాల్ లో చిన్నారులకు బోగి పళ్లు పోసి చిరాయుష్షు కలగాలని ఆశీర్వదించారు. ఏటికొప్పాక లక్క బొమ్మలు, బొబ్బిలి వీణలను పరిశీలించారు. వీణతో తంత్రిని మీటి సంగీత ధ్వనులను ఆస్వాదించారు. రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలు, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ఏర్పాటు చేసిన పర్యాటక శాఖ స్టాల్ ను సందర్శించారు. శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ , డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్ , పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్, జానపద కళలు, సృజనాత్మక అకాడమీ ఛైర్మన్
వంపూరి గంగులయ్య, మాజీ శాసన సభ్యులు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ కృష్ణంరాజు, ఏఎంసీ ఛైర్మన్ వాకపల్లి దేవి, జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ శ్రీ బిందు మాధవ్, నటులు హైపర్ ఆది, ఆర్ కే సాగర్ తదితరులు పాల్గొన్నారు.
