గ్రామాల్లో కూడా చెత్త ప్రాసెసింగ్ సెంటర్లు
గ్రామాల్లో కూడా చెత్త ప్రాసెసింగ్ సెంటర్లు
ప్రాసెస్ చేసిన చెత్త రీసైక్లింగ్ సెంటర్ల వారు కొనుగోలు
చెత్త సేకరణకు కార్పొరేషన్ ద్వారా యంత్రాల కొనుగోలు
త్వరలో డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా ఏపీ
ఆకస్మిక తనిఖీలు చేయనున్న సీఎం
‘స్వచ్ఛ సంక్రాంతి- స్వచ్ఛ గ్రామ పంచాయతీ’ సభలో పట్టాభిరామ్
అమరావతి: గ్రామాల్లో కూడా ప్రాసెంగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు, ప్రాసెస్ చేసిన చెత్తను రీసైక్లింగ్ సెంటర్ల వారు కొనుగోలు చేస్తారని, ఈ విధంగా గ్రామాలకు కొంత ఆదాయం సమకూరుతుందని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. చెత్త నుంచి సంపద సృష్టించడం అనేది మనం చేసి చూపిస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం రావినూతల గ్రామంలో శుక్రవారం జరిగిన ‘స్వచ్ఛ సంక్రాంతి- స్వచ్ఛ గ్రామ పంచాయతీ’ సభలో ఆయన ప్రసంగించారు. సంక్రాంతి సందర్భంగా మన ఇళ్లను శుభ్రపరిచి, నూతన వస్త్రాలు ఎలా ధరిస్తామో, అలాగే గ్రామాలను కూడా శుభ్రపరిచి స్వచ్ఛంగా రూపొందించాలనే ఆలోచనతోనే ‘స్వచ్ఛ సంక్రాంతి- స్వచ్ఛ గ్రామ పంచాయతీ’ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. 2025, జనవరి 25న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛ ఆంధ్ర ఉద్యమానికి నాంది పలికిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. మహానగరాలు, నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో చేపట్టవలసిన కార్యక్రమాలకు సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళుతున్నామన్నారు. పట్టణాలలో బయోమైనింగ్ ద్వారా కొంతవరకు లెగసీ వేస్ట్ ని క్లియర్ చేస్తున్నామని, ప్రాసెసింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
గ్రామాలపై ప్రత్యేక దృష్టి
ఇప్పుడు ప్రత్యేకంగా గ్రామాలపైన కూడా దృష్టిపెట్టినట్లు పట్టాభిరామ్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తమకు అన్ని విధాల సహకరిస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ తరఫున పారిశుద్ధ్యానికి సంబంధించి అనేక రకాల యంత్రాలను కొనుగోలు చేసి, వాటి ద్వారా చెత్త సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో 311 పుష్ కార్ట్స్( చేతితో నెట్టే బండ్లు), 982 ట్రైసైకిల్స్, 13 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్ యూనిట్స్, 8 ఎలక్ట్రిక్ వెహికల్స్ కేటాయించినట్లు వివరించారు. ఒక్క రావినూతల గ్రామ పంచాయతీకే రూ.20 లక్షల విలువైన యంత్రాలను అందించనున్నట్లు తెలిపారు. ఈ యంత్రాల ద్వారా డోర్ టూ డోర్ వేస్ట్ సేకరణ మెరుగుపడాలన్నారు. తడిచెత్త, పొడి చెత్త వేరు చేయాలని చెప్పారు. పొడి చెత్తలోని ప్లాస్టిక్ కోసం ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్ యూనిట్ ఒకదానిని రావినూతల గ్రామంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. రావినూతల గ్రామానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, అలాగే, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలకు కూడా గ్రామస్తులు సహకరించాలని కోరారు.
పట్టణాలలో 90 లక్షల టన్నుల చెత్త తొలగింపు
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా ఇప్పటి వరకు చేసినది ఒక ఎత్తైతే, ఇక ముందు చేయబోయేది చాలా ముఖ్యమైనదని, గ్రామాలలో మార్పు రావాలని అధికారులను ఉద్దేశించి చెప్పారు. గ్రామాలలో చిరకాలంగా పేరుకుపోయిన లెగసీ వేస్ట్ ని, అలా వదిలేయకుండా తొలగించాలన్నారు. పట్టణాలలోని దాదాపు 90 లక్షల టన్నుల చెత్తని తొలగించామని చెప్పారు. గత పాలకులు చెత్తపై పన్ను వేయడమే కాకుండా, డంపింగ్ యార్డులలో టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోయే విధంగా చేశారన్నారు. ఆ చెత్తనంతా తొలగిస్తున్నట్లు చెప్పారు.
త్వరలో డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా ఏపీ
రాష్ట్రంలో డంపింగ్ యార్డు కనిపించకుండా చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని, అందు కోసం ఆయన తమతో పని చేయిస్తున్నారన్నారు. డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా త్వరలో రాష్ట్రం అవతరించబోతుందని చెప్పారు. గ్రామాలలో పేరుకుపోయిన చెత్తని కూడా దగ్గరలో ఉన్న బయో మైనింగ్ సెంటర్లకు తరలించే ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా గ్రామాల ప్రజలు, అధికారులు కూడా పూర్తిగా సహకరించాలని కోరారు. అధికారులు ప్రభుత్వానికి సమర్పించే నివేదికల్లో మనల్ని మనం మోసం చేసుకోకుండా, ఉన్నవి ఉన్నట్లు వివరించమని కోరారు. ఏవైనా లోపాలు ఉన్నా తెలియజేయమని స్పష్టంగా చెప్పారు.
త్వరలో సీఎం ఆకస్మిక తనిఖీలు
సీఎం చంద్రబాబు త్వరలోనే గ్రామాలతో సహా ఆకస్మిక తనిఖీలు ప్రారంభించనున్నట్లు పట్టాభిరామ్ చెప్పారు. వేస్ట్ మేనేజమెంట్ ప్రాసెస్ ద్వారా మీరు ప్రాసెస్ చేసిన దానిని రీసైకిలర్స్ వచ్చి కొనుక్కొని తీసుకువెళతారన్నారు. తాము ఇచ్చిన యంత్ర సామాగ్రిని పూర్తిగా వినియోగించుకోమని పారిశుద్ధ్య సిబ్బందికి, ఇతర సిబ్బందికి చెప్పారు. తాము ఇచ్చినవి చాలకపోతే, మరికొన్ని అడగండని, సమకూరుస్తామని చెప్పారు. వాటిని వినియోగించకుండా కొత్తవాటిని అడగొద్దన్నారు.
సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ పరిశీలన
చైర్మన్ పట్టాభిరామ్ తొలుత గ్రామంలోని ఎస్ డబ్ల్యూపీసీ(చెత్తను శుద్ధి చేసి సంపదగా మార్చే కేంద్రం)ను సందర్శించి, అక్కడ పనితీరును పరిశీలించారు. వర్కర్స్, సిబ్బంది, అధికారులను అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నారు. అక్కడ సిబ్బంది సమస్యలను అర్థం చేసుకుని, పరిష్కార మార్గాలు చెప్పారు. అలాగే, గ్రామానికి రెండు ట్రై సైకిల్స్ ఇస్తామని, ప్రతి రోజూ ప్రతి ఇంటికి వెళ్లి వేస్ట్ ని సేకరించి, తడిచెత్త, పొడిచెత్త వేరుచేయాలని వివరంగా చెప్పారు. ఏపీ మారిటోరియమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి పట్టాభిరామ్ ఇ-ఆటోని ప్రారంభించారు.
ఈ కార్యక్రమాల్లో ఒంగోలు డీడీఓ సీహెచ్ సువార్త, కొనిశపాడు ఎంపీడీఓ ఎంఆర్ రాజ్యలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ టీవై చంద్రసేన్, రావినూతల ఆర్ఎస్ సీఏ అధ్యక్షుడు కారుశాల నాగేశ్వరరావు(బాబు), సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామపెద్దలు బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
