ఉక్రెయిన్‌పై రష్యా అత్యాధునిక ‘ఒరెష్నిక్’ క్షిపణి ప్రయోగం
ఉక్రెయిన్‌పై రష్యా అత్యాధునిక ‘ఒరెష్నిక్’ క్షిపణి ప్రయోగం
- హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్‌తో లెవివ్ లక్ష్యంగా దాడి
- పుతిన్ నివాసంపై డ్రోన్ దాడికి ప్రతీకారమా?
రష్యా తన అత్యాధునిక హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ అయిన ‘ఒరెష్నిక్’ క్షిపణిని ప్రయోగించింది. ధ్వని వేగాన్ని మించి ప్రయాణించే ఈ కట్టింగ్ ఎడ్జ్ సాంకేతిక క్షిపణితో ఉక్రెయిన్‌లోని లెవివ్ నగరంలో ఉన్న డ్రోన్ ఉత్పత్తి కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడితో ఆయా ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది.
ఈ క్షిపణి ప్రయోగం వెనుక ప్రతీకార భావన ఉందని రష్యా రక్షణ శాఖ పేర్కొంది. ఇటీవల ఉక్రెయిన్ డ్రోన్లతో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. నొవోగొరాడ్ ప్రాంతంలో ఉన్న పుతిన్ ఇంటిని లక్ష్యంగా చేసుకుని డిసెంబర్ 28 రాత్రి ఉక్రెయిన్ సుమారు 91 సుదీర్ఘ దూరం ప్రయాణించే డ్రోన్లను వదిలినట్లు రష్యా వెల్లడించింది. అయితే వాటిని మాస్కో రక్షణ వ్యవస్థ పూర్తిగా కూల్చివేసిందని తెలిపింది.
లెవివ్ ప్రాంతంలో ఒరెష్నిక్ క్షిపణి దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలాండ్ సరిహద్దుకు సమీపంలో ఈ క్షిపణి పేలినట్లు తెలుస్తోంది. క్షిపణి ప్రయోగ సమయంలో అనేక ప్రాజెక్టైల్‌లు విడిపడుతూ లక్ష్యాలను ఛేదించే దృశ్యాలు ఆ వీడియోల్లో కనిపిస్తున్నాయి. లెవివ్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అండర్‌గ్రౌండ్ గ్యాస్ సదుపాయ కేంద్రాన్ని కూడా ఈ క్షిపణి ధ్వంసం చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఒరెష్నిక్ క్షిపణిని రష్యా ఇది రెండోసారి వినియోగించినట్లు సమాచారం. గతంలో 2024 నవంబర్‌లో ఉక్రెయిన్‌లోని డ్నిపర్ నగరంపై ఈ క్షిపణిని ప్రయోగించింది. అంతేకాదు, 2025 చివర్లో బెలారస్‌పై కూడా ఈ క్షిపణిని ప్రయోగించినట్లు రష్యా వర్గాలు వెల్లడించాయి.
ఒరెష్నిక్ క్షిపణిని తోకచుక్కతో పోలుస్తూ పుతిన్ గతంలో వ్యాఖ్యానించారు. ఒకేసారి అనేక లక్ష్యాలను ఛేదించగల మల్టిపుల్ వార్‌హెడ్స్‌ను ఇది మోసుకెళ్తుందని తెలిపారు. ధ్వని వేగానికి పది రెట్ల వేగంతో ప్రయాణించే ఈ క్షిపణి లక్ష్య ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఇంటర్‌మీడియట్ రేంజ్ క్షిపణిగా పిలిచే ఒరెష్నిక్ గరిష్ఠంగా 5,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంది.
ఇదిలా ఉండగా, రష్యా తనపై ఒరెష్నిక్ క్షిపణితో పాటు మరో 13 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ వెల్లడించారు. వీటితో పాటు 22 క్రూయిజ్ క్షిపణులు, 242 డ్రోన్లను కూడా రష్యా వదిలినట్లు ఆయన తెలిపారు. ఈ దాడులు ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.
