కృతజ్ఞతకు విలువ తగ్గిందా? మనసు మాట మరిచిన సమాజం
కృతజ్ఞతకు విలువ తగ్గిందా? మనసు మాట మరిచిన సమాజం
- మనిషిని మనిషిగా నిలబెట్టే కృతజ్ఞత
- విజయ మత్తులో మరిచిపోతున్న మూలాలు
- సమాజానికి అత్యవసరమైన ‘ధన్యవాదాల’ సంస్కృతి
మన జీవితం ఒక పొడవైన ప్రయాణం. ఆ ప్రయాణంలో ప్రతి అడుగు మన ఒంటరి శ్రమ ఫలితమా? నిజంగా అలా అనుకోవడం మన ఆత్మవంచన మాత్రమే. మన పుట్టుక నుంచి ఈ క్షణం వరకు మన వెనుక నిలబడి, కనిపించకుండా సహాయం చేసిన చేతులు ఎన్నో ఉన్నాయి. తల్లిదండ్రులు తమ జీవితాలను త్యాగం చేసి పిల్లల భవిష్యత్తును నిర్మిస్తారు. గురువులు తమ జ్ఞానాన్ని పంచి దారి చూపుతారు. స్నేహితులు కష్టసమయంలో భుజం ఇస్తారు. కొన్నిసార్లు అపరిచితుల సహాయం కూడా మన జీవితాన్ని మలుపుతిప్పుతుంది. కానీ ఈ సహాయాలన్నింటినీ మనం గుర్తుంచుకుంటున్నామా? లేక విజయానికి చేరుకున్న తర్వాత, ఈ మూలాలను మరిచిపోతున్నామా అన్న ప్రశ్న ఇప్పుడు సమాజాన్ని వెంటాడుతోంది.
ఒకప్పుడు కృతజ్ఞత మన సంస్కృతిలో భాగంగా ఉండేది. పెద్దల పట్ల గౌరవం, ఉపకారాన్ని గుర్తుంచుకునే స్వభావం మనకు సహజంగా ఉండేది. ఎవరో చేసిన మేలు జీవితాంతం గుర్తుంచుకుని, అవసరమైనప్పుడు ప్రతిఫలం చెల్లించాలనే భావన ఉండేది. కానీ కాలం మారింది. ఆధునిక జీవనశైలి, తీవ్ర పోటీ, స్వార్థపు ఆలోచనలు మన మనసులను ఆక్రమించాయి. ఎదుగుదలనే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రయాణంలో, మనల్ని ముందుకు నడిపించిన వారిని వెనక్కి నెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ‘నేనే చేశాను’, ‘నాకెవరి అవసరం లేదు’ అనే భావన పెరుగుతోంది. ఇది కేవలం వ్యక్తిగత అహంకారం కాదు, ఇది సమాజంలో విలువల పతనానికి సంకేతం.
నేటి సమాజంలో ‘ధన్యవాదాలు’ అనే మాట వినిపించడం అరుదైపోతోంది. అవసరం ఉన్నంతవరకే సంబంధాలు, అవసరం తీరాక మౌనం. పని పూర్తయ్యాక మనుషులు కూడా ఉపయోగపడిన వస్తువుల్లా పక్కకు నెట్టబడుతున్నారు. సోషల్ మీడియా యుగంలో కృతజ్ఞత కూడా ఒక ఫార్మాలిటీగా మారింది. ఒక మెసేజ్, ఒక ఎమోజీ, ఒక ‘లైక్’తో సరిపెట్టుకుంటున్నాం. కానీ ఇవి నిజమైన కృతజ్ఞతకు ప్రత్యామ్నాయమా? హృదయపూర్వకంగా చెప్పే ఒక్క మాట, మనస్ఫూర్తిగా చేసే ఒక పని ఇచ్చే సంతృప్తిని ఇవి ఇవ్వలేవు. మనిషి-మనిషి మధ్య బంధాలను నిలబెట్టేది సాంకేతికత కాదు, భావోద్వేగం.
కృతజ్ఞత లేకపోతే మనిషి కఠినుడవుతాడు. తన అవసరాలే ప్రపంచమని భావిస్తాడు. అలాంటి వ్యక్తులతో కూడిన సమాజం చివరికి నమ్మకాన్ని కోల్పోతుంది. ఒకరినొకరు గుర్తించని పరిస్థితి, పరస్పర గౌరవం లేని వాతావరణం సామాజిక విఘటనకు దారితీస్తుంది. నేటి రోజుల్లో పెరుగుతున్న ఒంటరితనం, సంబంధాల్లో శూన్యత ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. మన చుట్టూ జనాలు ఉన్నా, మనసుకు దగ్గరగా ఉండేవాళ్లు లేని పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచించాల్సిన సమయం ఇది. కృతజ్ఞత కోల్పోయిన సమాజం భావోద్వేగంగా దరిద్రంగా మారుతుందన్నది కఠినమైన నిజం.
అంతర్జాతీయ థ్యాంక్ యూ డే మనకు ఒక హెచ్చరికలా నిలుస్తోంది. ఇది కేవలం ఒక రోజుకు పరిమితమైన ఆచారం కాదు. మన జీవన విధానాన్ని పునరాలోచించాల్సిన సందర్భం. మన ఇంట్లో తల్లిదండ్రులకు మనం నిజంగా కృతజ్ఞత చూపుతున్నామా? గురువులను అవసరం ఉన్నప్పుడే గుర్తు చేసుకుంటున్నామా? కార్యాలయాల్లో సహకరించిన సహోద్యోగులను, కష్టసమయంలో తోడుగా నిలిచిన వారిని మనం ఎంతవరకు గుర్తుంచుకుంటున్నాం? ఈ ప్రశ్నలకు మనస్ఫూర్తిగా సమాధానం చెప్పుకోగలిగితేనే ఈ దినోత్సవానికి అర్థం ఉంటుంది.
కృతజ్ఞత చెప్పడం మన స్థాయిని తగ్గించదు. అది మన వ్యక్తిత్వాన్ని మరింత గొప్పగా చేస్తుంది. వినయం, మానవత్వం, పరస్పర గౌరవం ఇవన్నీ కృతజ్ఞత నుంచే పుడతాయి. ఒక సమాజం నిజంగా ఎదగాలంటే ఆర్థిక అభివృద్ధితో పాటు భావోద్వేగ సంపద కూడా అవసరం. ఆ సంపదకు మూలం కృతజ్ఞత. కనీసం ఈ రోజైనా మన జీవితంలో వెలుగులు నింపిన వారిని గుర్తు చేసుకుని, మనస్ఫూర్తిగా “ధన్యవాదాలు” చెప్పగలిగితే… అదే అంతర్జాతీయ థ్యాంక్ యూ డేకు నిజమైన నివాళి.
