సింక్ అవుతున్న గ్లోబల్ సిటీస్.. ప్రమాదంలో భారత నగరాలు
సింక్ అవుతున్న గ్లోబల్ సిటీస్.. ప్రమాదంలో భారత నగరాలు
జకార్తా మొదలు చెన్నై వరకు భూమి కుంగిపోతున్న వాస్తవం
భూగర్భ జలాల దుర్వినియోగమే ప్రధాన కారణం
ప్రపంచవ్యాప్తంగా అనేక మహానగరాలు మెల్లగా నేలలోకి కుంగిపోతున్నాయని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఇది ఇప్పుడు కేవలం ఒక దేశానికి పరిమితమైన సమస్య కాకుండా అంతర్జాతీయ స్థాయి సంక్షోభంగా మారింది. ఇండోనేషియా రాజధాని జకార్తా ఈ ప్రమాదాన్ని అత్యంత తీవ్రంగా ఎదుర్కొంటున్న నగరంగా గుర్తించబడింది. ఇప్పటికే ఈ నగరంలోని కొన్ని ప్రాంతాలు సముద్ర మట్టానికి దిగువకు చేరుకున్నాయి. భూగర్భ జలాలను అధికంగా వినియోగించడం, భారీ భవన నిర్మాణాలు, నియంత్రణ లేని పట్టణీకరణ, అతి భారీ వర్షాలు జకార్తా నేల కుంగిపోవడానికి ప్రధాన కారణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇదే తరహా పరిస్థితులు భారత్‌లోనూ ఏర్పడుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. సింగపూర్‌లోని నాన్యంగ్ టెక్నాలజీ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధన ప్రకారం, భారతదేశంలోని పలు ప్రధాన నగరాలు భూమి కుంగిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఇందులో చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగుళూరు వంటి నగరాలు ఉన్నాయి. ఈ అధ్యయనం ప్రకారం కోల్‌కతా నగరం ప్రతి ఏడాది సగటున 2.8 సెంటీమీటర్లు నేలలోకి కుంగిపోతుండగా, చెన్నై నగరం ఏడాదికి 3 సెంటీమీటర్లకు పైగా సింక్ అవుతోంది. అహ్మదాబాద్ నగరం మరింత ప్రమాదకర స్థాయిలో ప్రతి సంవత్సరం సుమారు 4 సెంటీమీటర్లు కుంగిపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ మూడు నగరాల్లో కలిపి సుమారు 878 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం భూమి మెల్లగా దిగబడుతోందని అధ్యయనం స్పష్టం చేసింది. గుజరాత్ ప్రాంతం భవిష్యత్తులో వరదల ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
భూమి కుంగిపోవడం వల్ల లక్షలాది ప్రజల నివాస ప్రాంతాలు అస్థిరంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. భూగర్భ జలాలను లోతుగా డ్రిల్లింగ్ చేసి వినియోగించడం వల్ల నేలలోని మట్టిపై ఒత్తిడి పెరిగి, దాని సహజ బలం కోల్పోతుందని వివరిస్తున్నారు. దీని ప్రభావం భవనాలు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతుండటం తీర ప్రాంత నగరాలను మరింత ప్రమాదంలోకి నెడుతోంది. భవిష్యత్తులో సముద్రం లోనికి చొచ్చుకొచ్చే పరిస్థితులు తలెత్తవచ్చని, కొన్ని ప్రాంతాలు శాశ్వతంగా నీటమునిగే ప్రమాదం కూడా ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా పట్టణాల నీటి వినియోగ విధానాలు, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై కొత్త దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. భూగర్భ జలాల దుర్వినియోగాన్ని తగ్గించడం, సుస్థిర పట్టణాభివృద్ధి విధానాలను అమలు చేయడం, తక్షణ చర్యలు తీసుకోవడం అత్యవసరమని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు.
