తెలంగాణలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ టికెట్ రేట్ల పెంపు.. జీవో జారీ!
తెలంగాణలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ టికెట్ రేట్ల పెంపు.. జీవో జారీ!
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే థియేటర్లలో భారీ చిత్రాలు సందడి చేస్తుండగా, మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, విజయవంతమైన దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు తెలంగాణ ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చింది. ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రత్యేక ప్రీమియర్ షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జనవరి 11న ప్రత్యేక ప్రీమియర్ షోలకు అనుమతి లభించింది. ఈ షోల టికెట్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఈ ప్రీమియర్ షోలను ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాగే జనవరి 12 నుంచి వారం రోజుల పాటు సాధారణ థియేటర్లలో 50 రూపాయలు, మల్టీ స్క్రీన్ థియేటర్లలో 100 రూపాయలు అదనంగా టికెట్ ధర పెంచుకునే వెసులుబాటు కల్పించారు. ఇదివరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ సినిమాకు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటించగా, విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
