సనాతన ధర్మ పరిరక్షణకు 150 కిమీ పాదయాత్ర
సనాతన ధర్మ పరిరక్షణకు 150 కిమీ పాదయాత్ర
- ఆత్మకూరు నుంచి తిరుమలకు జనసేన నాయకుల ప్రయాణం
- తిరుపతిలో ఘన స్వాగతం
- కల్తీ నెయ్యి ఘటనపై కఠిన చర్యల డిమాండ్
తిరుపతి, 14 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్): సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి తిరుమల వరకు చేపట్టిన 150 కిలోమీటర్ల పాదయాత్ర ఐదవ రోజున తిరుపతి చేరుకుంది. జనసేన పార్టీ నాయకులు చదలవాడ హరీష్ కుమార్, చదలవాడ మృదుల, నూనె హరీష్ యాదవ్, అక్బర్ బాషా, దాడి భాను కిరణ్ తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు. అలిపిరి మార్గం ద్వారా తిరుమలకు చేరుకుని తమ నిరసనను తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. తిరుపతి లీలామహల్ కోడలి వద్ద జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి, శ్రీ కాళహస్తి ఆలయ ఛైర్మన్ కొట్టేసాయి, ఇతర నాయకులు, వీర మహిళలు యాత్రికులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చదలవాడ హరీష్ కుమార్ మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. కల్తీ నెయ్యి ఘటనపై దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
రాజారెడ్డి మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కల్యాణ్ నిలుస్తున్నారని అన్నారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన కల్తీ నెయ్యి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. లడ్డు ప్రసాదం విషయంలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.
అలిపిరి బాట మార్గం ద్వారా తిరుమలకు చేరుకుని భక్తుల మనోభావాలను కించపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని యాత్రికులు కోరారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలనే అభ్యర్థనకు మద్దతుగా ఈ పాదయాత్ర నిర్వహించినట్లు తెలిపారు. యాత్ర విజయవంతంగా కొనసాగుతోందని నాయకులు వెల్లడించారు.
