వాలెంటైన్స్ డే స్పెషల్… 25 ఏండ్ల తర్వాత ‘మనసంతా నువ్వే’ రీ-రిలీజ్
వాలెంటైన్స్ డే స్పెషల్… 25 ఏండ్ల తర్వాత ‘మనసంతా నువ్వే’ రీ-రిలీజ్
హైదరాబాద్, ఫిబ్రవరి 11 – పీపుల్స్ మోటివేషన్
టాలీవుడ్ లవర్ బాయ్‌గా గుర్తింపు పొందిన దివంగత నటుడు ఉదయ్ కిరణ్ కెరీర్‌లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన ‘మనసంతా నువ్వే’ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. విడుదలై 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సూపర్ హిట్ ప్రేమకథా చిత్రాన్ని వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ప్రేమకథల అభిమానులకు ఈ వార్త ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఎం.ఎస్. రాజు నిర్మాణంలో, వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైన సమయంలో భారీ విజయాన్ని సాధించడంతో పాటు ఉదయ్ కిరణ్‌ను స్టార్ హీరోగా నిలబెట్టింది. స్వచ్ఛమైన ప్రేమకథ, భావోద్వేగాలకు దగ్గరగా ఉండే కథనం, హృద్యమైన పాటలతో ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను మళ్లీ వెండితెరపై చూపించేందుకు నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్యా రెడ్డి, రఘురామ్ రెడ్డి, రవికాంత్ రెడ్డి సంయుక్తంగా రీ-రిలీజ్ చేస్తున్నారు.
రీ-రిలీజ్ సందర్భంగా ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మేనకోడలు మహతి మాట్లాడుతూ, సినిమా విడుదలైనప్పుడు తనకు కేవలం రెండు నెలల వయస్సు మాత్రమేనని, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత తన మామయ్య సినిమాను థియేటర్‌లో చూడటం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోందని తెలిపింది. మరోవైపు మేనల్లుడు తేజ స్పందిస్తూ, అప్పట్లో తాను చిన్నవాడినని, ఇప్పుడు కూడా ప్రేక్షకులు ఉదయ్ కిరణ్‌పై చూపిస్తున్న ప్రేమ చూసి గర్వంగా ఉందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటామని చెప్పారు.
రీమా సేన్, తనూ రాయ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఆర్.పి. పట్నాయక్ అందించిన సంగీతం అప్పట్లో పెద్ద హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ ‘మనసంతా నువ్వే’ పాటలు ప్రేమికుల ప్లేలిస్ట్‌లో ప్రత్యేక స్థానం దక్కించుకున్నాయి. నేటి తరం ప్రేక్షకులకు ఒక స్వచ్ఛమైన ప్రేమకథను మరోసారి పరిచయం చేస్తూ, వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో మళ్లీ సందడి చేయనుంది.
