‘ది కేరళ స్టోరీ 2’ విడుదల నిలిపివేత.. హైకోర్టు ఆగ్రహం
‘ది కేరళ స్టోరీ 2’ విడుదల నిలిపివేత.. హైకోర్టు ఆగ్రహం
కొచ్చి – ఫిబ్రవరి 26 – పీపుల్స్ మోటివేషన్
బాలీవుడ్‌లో రూపొందిన వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ 2 విడుదలపై కేరళ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన చిత్రం విడుదల కావాల్సి ఉండగా, విడుదలకు ఒక్కరోజు ముందు కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
సెన్సార్ ధ్రువీకరణ ఇచ్చే ప్రక్రియలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తన విచక్షణను సముచితంగా వినియోగించలేదని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మత సంబంధ అంశాలు, సామాజిక సామరస్యానికి భంగం కలిగించే విషయాలపై పాటించాల్సిన మార్గదర్శకాలను పూర్తిగా పరిశీలించకుండానే సర్టిఫికేట్ మంజూరు చేసినట్లు కోర్టు అభిప్రాయపడింది.
ఈ చిత్రం కేరళ రాష్ట్రాన్ని ప్రతికూలంగా చిత్రీకరిస్తోందని, తప్పుడు ప్రచారంతో మతాల మధ్య విభేదాలు రేకెత్తించే అవకాశం ఉందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేరళ పేరును వినియోగిస్తూ రాష్ట్రానికి సంబంధం లేని కథను చూపించడం కూడా ఆందోళనకరమని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ బెచు కురియన్ థామస్ కేరళ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందని, అయితే ఈ చిత్రం ద్వారా విపరీతమైన సంకేతాలు వెలువడుతున్నాయని వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో చిత్రానికి ఇచ్చిన ధ్రువీకరణను మరోసారి సమగ్రంగా పరిశీలించాలని, పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డును కోర్టు ఆదేశించింది. మరోవైపు, సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే ఉత్తర్వులను సవాలు చేస్తూ చిత్ర నిర్మాతలు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
