పురపోరులో పొంగులేటి మ్యాజిక్ – 70 శాతం సక్సెస్ రేటు
పురపోరులో పొంగులేటి మ్యాజిక్ – 70 శాతం సక్సెస్ రేటు
- 249 వార్డుల్లో ప్రచారం – 174 చోట్ల హస్తం జెండా
- ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌లో కాంగ్రెస్ ప్రభంజనం
- శీనన్న వ్యూహంతో ప్రత్యర్థుల కోటలు బద్దలు
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (పీపుల్స్ మోటివేషన్): మున్సిపల్ ఎన్నికల కురుక్షేత్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అజేయ శక్తిగా నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పగించిన బాధ్యతను సవాలుగా తీసుకుని కేవలం పది రోజుల్లో 249 వార్డుల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచార ఫలితంగా 174 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడంతో సుమారు 70 శాతం సక్సెస్ రేటు నమోదు కావడం విశేషం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డుల్లో 24 చోట్ల కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో 22 స్థానాలు గెలుచుకోగా, కల్లూరులో 12, సత్తుపల్లిలో 17 వార్డులను హస్తం ఖాతాలో వేసుకున్నారు. ఇల్లందులో 19, అశ్వారావుపేటలో 17 స్థానాల్లో గెలిచి జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పట్టు బలపడినట్లు స్పష్టం అయింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా శీనన్న వ్యూహం ఫలించింది. భూపాలపల్లిలో 16 వార్డులు గెలుచుకోగా, పరకాలలో 13, స్టేషన్ ఘన్‌పూర్‌లో 13 స్థానాలు సాధించి కాంగ్రెస్ ప్రాభవాన్ని చాటింది. ప్రత్యర్థుల బలమైన కోటలుగా భావించిన ప్రాంతాల్లోనూ పార్టీ విజయపథంలో దూసుకెళ్లడం గమనార్హం. మొత్తంగా మంత్రి పొంగులేటి ప్రచారం నిర్వహించిన 249 వార్డుల్లో 174 స్థానాల్లో విజయం సాధించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. రేవంత్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషి ఫలితమే ఈ విజయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఫలితాలతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ పురపాలికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించినట్లు స్పష్టం అయింది.
