భళా అమ్మాయిలు.. ఆసియా కప్ కొల్లగొట్టిన టీమిండియా..!
భళా అమ్మాయిలు.. ఆసియా కప్ కొల్లగొట్టిన టీమిండియా..!
కౌలాలంపూర్ – ఫిబ్రవరి 22 – పీపుల్స్ మోటివేషన్
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత మహిళల జట్టు మరోసారి తన సత్తా చాటింది. ఇప్పటికే హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత్ మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించగా, తాజాగా రాధా యాదవ్ నాయకత్వంలోని భారత ఏ జట్టు మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ పోటీలో విజేతగా నిలిచింది. సెమీఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన భారత అమ్మాయిలు ఫైనల్లో బంగ్లాదేశ్‌పై పూర్తి ఆధిపత్యం చాటుతూ ట్రోఫీని సొంతం చేసుకున్నారు.
ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అయితే తేజల్ హసబ్నిస్ అజేయంగా 51 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. కెప్టెన్ రాధా యాదవ్ 38 పరుగులతో కీలక పాత్ర పోషించింది. ఐదో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గౌరవప్రదమైన స్కోరుకు చేర్చారు. నిర్ణీత ఓవర్లలో భారత్ 134 పరుగులు సాధించింది.
135 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. సైమా థాకొర్ ప్రారంభంలోనే ఇష్మా తంజిమ్ వికెట్ తీసి ఒత్తిడి పెంచింది. షమీమా సుల్తానాను వెనక్కి పంపిన ప్రేమా రావత్ మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి మధ్య వరుసను కూల్చింది. రాధా యాదవ్ తన ఓవర్లో షర్మీన్ సుల్తానాను ఔట్ చేసి జట్టుకు మరింత ఊపు ఇచ్చింది. సదియా అక్తర్, లతా మొండల్‌లను కూడా ప్రేమా ఔట్ చేయడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ వైపు మొగ్గుచూపింది. మరోవైపు తనూజ కన్వర్ రెండు వికెట్లు తీసి బంగ్లాదేశ్‌పై పట్టు బిగించింది. చివరికి బంగ్లాదేశ్ జట్టు 88 పరుగులకే కుప్పకూలింది.
46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టు ఆసియా కప్ ట్రోఫీని అందుకుని అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. వరుస విజయాలతో భారత మహిళల క్రికెట్ భవిష్యత్తుపై మరింత నమ్మకం పెరిగింది.
