స్పిన్ వ్యూహానికి శ్రీలంక చిత్తు.. సూపర్ 8లో ఇంగ్లండ్ బోణీ..!
స్పిన్ వ్యూహానికి శ్రీలంక చిత్తు.. సూపర్ 8లో ఇంగ్లండ్ బోణీ..!
పల్లెకెలె – ఫిబ్రవరి 22 – పీపుల్స్ మోటివేషన్
స్వదేశంలో స్పిన్ అస్త్రంతో ప్రత్యర్థులను దెబ్బతీయాలనుకున్న శ్రీలంకకు ఇంగ్లండ్ భారీ షాక్ ఇచ్చింది. పల్లెకెలె స్టేడియంలో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టమైన ప్రదర్శనతో ఆతిథ్య జట్టును కట్టడి చేశారు. ముఖ్యంగా విల్ జాక్స్ మూడు వికెట్లతో లంక బ్యాటింగ్‌ను తిప్పికొట్టగా, ఆదిల్ రషీద్ కీలక సమయంలో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌పై పట్టు బిగించాడు. 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్ గ్రూప్ బీలో విజయ ఖాతా తెరిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు శ్రీలంక స్పిన్నర్లను ఎదుర్కొంటూ పోరాడి గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఒత్తిడిలోనూ అద్భుత అర్ధశతకంతో జట్టును నిలబెట్టాడు. దునిత్ వెల్లలాగే, మహీష్ తీక్షణలు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ను కుదిపేశారు. అయినప్పటికీ చివర్లో విల్ జాక్స్, జేమీ ఓవర్టన్ వేగంగా పరుగులు సాధించడంతో నిర్ణీత ఓవర్లలో ఇంగ్లండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది.
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రమాదకర ఓపెనర్ పథుమ్ నిశాంకను జోఫ్రా ఆర్చర్ త్వరగా ఔట్ చేయడంతో లంక ఒత్తిడిలో పడింది. వెంటనే విల్ జాక్స్ తన స్పిన్ మాయాజాలంతో కుశాల్ మెండిస్, పవన్ రత్ననాయకే, దునిత్ వెల్లలాగేలను వెనక్కి పంపాడు. పవర్ ప్లే ముగిసే సరికి శ్రీలంక 34 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
సగం జట్టు వెనుదిరిగిన సమయంలో కెప్టెన్ దసున్ శనక పోరాడే ప్రయత్నం చేశాడు. కమిందు మెండిస్‌తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పాలని చూశాడు. అయితే కీలక సమయంలో లియామ్ డాసన్, ఆదిల్ రషీద్ వికెట్లు తీసి లంక ఆశలు చెదరగొట్టారు. అవసరమైన పరుగుల రేటు పెరుగుతుండగా భారీ షాట్లు ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయిన శ్రీలంక చివరకు 99 పరుగులకే ఆలౌటైంది.
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ శ్రీలంకపై పూర్తి ఆధిపత్యం చాటింది. స్వదేశంలోనే పరాజయం పాలైన శ్రీలంకకు ఇది పెద్ద ఎదురుదెబ్బగా మారగా, సూపర్ 8లో ఇంగ్లండ్ బలమైన ఆరంభం చేసింది.
