వెండి ఆభరణాల కోసం వృద్ధురాలిని మంచంతో సహా ఎత్తుకెళ్లిన దొంగలు
వెండి ఆభరణాల కోసం వృద్ధురాలిని మంచంతో సహా ఎత్తుకెళ్లిన దొంగలు
భిల్వారా జిల్లా, ఫిబ్రవరి 6 (పీపుల్స్ మోటివేషన్):
వెండి ధరలు పెరగడంతో దొంగల కన్ను ఇప్పుడు వెండి ఆభరణాలపై పడింది. ఈ క్రమంలో 90 ఏళ్ల వృద్ధురాలి ఒంటిపై ఉన్న సంప్రదాయ వెండి ఆభరణాల కోసం దొంగలు అమానుషానికి పాల్పడ్డ ఘటన భిల్వారా జిల్లాలో చోటుచేసుకుంది. ఇంటి వరండాలో నిద్రిస్తున్న వృద్ధురాలిని మంచంతో సహా ఎత్తుకెళ్లి చోరీకి ప్రయత్నించారు. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా కోథియా గ్రామంలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. మాజీ సర్పంచ్ నాథీ దేవి మాలి ఇంట్లో దొంగలు చోరీకి యత్నించారు. ఇంటి వరండాలో నిద్రిస్తున్న నాథీ దేవి అత్త అయిన చోటీ దేవి చేతులు, కాళ్లకు సుమారు ఒకటిన్నర కిలోల వెండి కంకణాలు, ఆభరణాలు ఉండటాన్ని గమనించిన దొంగలు వాటిని దోచుకునేందుకు పథకం వేశారు. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు బయటకు రాకుండా ఉండేందుకు దొంగలు ఇంటి తలుపుకు తాళం వేశారు. మంచంపై నిద్రిస్తున్న చోటీ దేవి అరవకుండా ఆమె నోరు మూసి, మంచంతో సహా సమీపంలోని పొలానికి మోసుకెళ్లారు. అక్కడ ఆమె చేతులు, కాళ్లు కట్టి, వెండి కంకణాలు తొలగించేందుకు ప్రయత్నించారు.
అయితే అర్థరాత్రి సమయంలో ఇంట్లో అలికిడి కావడంతో కుటుంబ సభ్యులు మేల్కొన్నారు. బయట నిద్రిస్తున్న చోటీ దేవి మంచంతో సహా కనిపించకపోవడంతో వారు ఆందోళన చెందారు. తలుపుకు తాళం వేసి ఉండటాన్ని గమనించి ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశారు. గ్రామస్తులు వచ్చి తాళం పగులగొట్టి, వృద్ధురాలిని వెతకడం ప్రారంభించారు. గ్రామస్తులు వస్తున్నట్లు గమనించిన దొంగలు వృద్ధురాలిని పొలంలోనే వదిలేసి పారిపోయారు. చేతులు, కాళ్లు కట్టబడి మంచంపై ఉన్న చోటీ దేవిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గుర్తించి ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
