సూపరింటెండింగ్ ఇంజనీర్‌పై ఏసీబీ దాడులు
సూపరింటెండింగ్ ఇంజనీర్‌పై ఏసీబీ దాడులు
విశాఖపట్నం, ఫిబ్రవరి 5 (పీపుల్స్ మోటివేషన్):
ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ మరో అవినీతి అధికారిని పట్టుకుంది. ఈసారి పదవీ విరమణకు నెల రోజులే గడవకముందే పంచాయతీ రాజ్ శాఖకు చెందిన సూపరింటెండింగ్ ఇంజనీర్ కల్లేపల్లి శ్రీనివాసరావుపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. విశాఖపట్నం పంచాయతీ రాజ్ శాఖలో సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా పనిచేసిన శ్రీనివాసరావు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఏసీబీ అధికారులు విశాఖపట్నం, సాలూరు, హైదరాబాద్‌లలో మొత్తం ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో నిందితుడి నివాస గృహంతో పాటు ఇతర ఆస్తులు కూడా ఉన్నాయి. సోదాల సమయంలో భారీగా ఆస్తి పత్రాలు, నగదు, బంగారం, వెండి తదితర కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ ప్రకారం నిందితుడు అక్రమంగా కలిగి ఉన్న ఆస్తుల్లో మూడు ఇంటి స్థలాలు, రెండు నివాస ఫ్లాట్లు, 18.57 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నాయి. అదనంగా రూ.61.87 లక్షల నగదు, సుమారు 2.5 కిలోల బంగారం, 20.3 కిలోల వెండి, ఒక కారుతో పాటు ద్విచక్ర వాహనం, విలువైన గృహోపకరణాలు గుర్తించారు. ఐదు బ్యాంకు లాకర్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు, వాటిని రేపు తెరవనున్నట్లు తెలిపారు.
కల్లేపల్లి శ్రీనివాసరావు 1990లో పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తూ పదోన్నతులు పొందిన ఆయన, చివరకు సూపరింటెండింగ్ ఇంజనీర్‌గా విశాఖపట్నంలో విధులు నిర్వహించారు. 2025 డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు.
అవినీతి, లంచగొండితనంపై ఫిర్యాదులు ఉన్న ప్రజలు సంబంధిత జిల్లా ఏసీబీ అధికారులను సంప్రదించాలని, లేకపోతే టోల్ ఫ్రీ నంబర్ 1064, మొబైల్ నంబర్ 9440440057 లేదా ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులు సూచించారు.

