గతంలో జోక్స్‌తోనే కాలక్షేపం చేసేవాడిని.. ఇప్పుడలా కాదు: ఇషాన్ కిషన్
గతంలో జోక్స్‌తోనే కాలక్షేపం చేసేవాడిని.. ఇప్పుడలా కాదు: ఇషాన్ కిషన్
న్యూఢిల్లీ – ఫిబ్రవరి 13 – పీపుల్స్ మోటివేషన్
భారత జట్టు స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఇటీవలి కాలంలో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. దేశవాళీ పోటీల్లో రాణిస్తూ తిరిగి జట్టులో స్థానం సంపాదించిన ఇషాన్, ప్రస్తుతం తన ఆటలో వచ్చిన మార్పులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో ఎక్కువ సమయం సరదా మాటలతో గడిపేవాడినని, ఇప్పుడు మాత్రం పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టుతున్నానని వెల్లడించాడు.
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన ఇషాన్, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌ల నుంచి మంచి ప్రదర్శనలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులు చేసి జట్టుకు వేగవంతమైన ఆరంభం అందించాడు. ఈ ప్రదర్శనతో ప్రపంచ కప్‌లోనూ తన స్థానం బలపరుచుకున్నాడు.
ఈ సందర్భంగా ఇషాన్ మాట్లాడుతూ, గతంలో రోజంతా సరదా మాటలతోనే కాలక్షేపం చేసేవాడినని, ఇప్పుడు ఆఅలవాటును తగ్గించి బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌పై ఎక్కువ సమయం కేటాయిస్తున్నానని తెలిపాడు. జట్టుకు ఉపయోగపడే విధంగా తనను తాను మార్చుకున్నానని, క్రికెట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నానని పేర్కొన్నాడు.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్–పాకిస్థాన్ మధ్య కీలక పోరు జరగనుంది. పాకిస్థాన్ బౌలర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై జరుగుతున్న చర్చల నేపథ్యంలో కూడా ఇషాన్ స్పందించాడు. ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, బంతిని గమనిస్తూ సహజమైన ఆట ఆడడమే లక్ష్యమని చెప్పాడు. మంచి స్కోరు సాధించి జట్టుకు విజయాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపాడు.
ప్రస్తుతం ఇషాన్ ప్రదర్శన జట్టుకు బలాన్నిస్తుండగా, కీలక మ్యాచ్‌కు ముందు అతని ఆత్మవిశ్వాసం అభిమానుల్లో ఆశలు పెంచుతోంది.
