ప్రజావాణి ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన
ప్రజావాణి ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన
- కాముని చెరువు, తుర్క చెరువు అభివృద్ధికి ఆదేశాలు
- ఆక్రమణల తొలగింపు, ఫెన్సింగ్‌పై స్పష్టమైన దిశానిర్దేశం
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (పీపుల్స్ మోటివేషన్):
ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం క్షేత్రస్థాయిలో విస్తృత పరిశీలన చేపట్టారు. స్థానికులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారత్‌నగర్–ఖైతలాపూర్–హైటెక్ సిటీ రోడ్డుకు ఎడమవైపున ఉన్న కాముని చెరువులో మురుగు నీరు చేరడంతో దుర్గంధం, గుర్రపు డెక్క విస్తరించి దోమల బెడద పెరిగిందని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించి అభివృద్ధి చేయాలని కోరారు.
కాముని చెరువు ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లను పరిశీలించిన కమిషనర్, వెంటనే అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే జలమండలి–స్థానిక ముస్లింల మధ్య ఉన్న గ్రేవ్‌యార్డు స్థల వివాదాన్ని కూడా పరిశీలించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి వివరాలు సేకరించి సమస్యకు పరిష్కారం చూపుతామని, ప్రభుత్వ భూమి మేరకు ఫెన్సింగ్ వేయాలని హైడ్రా అధికారులకు సూచించారు. కూకట్‌పల్లి, శంషిగూడలోని శిల్పా బృందావన్ కాలనీలో హెచ్‌ఎండీఏ లేఔట్ మార్చి పక్కనున్న ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారనే ఫిర్యాదుపై కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, ప్రభుత్వ భూమి మేరకు ఫెన్సింగ్ వేయాలని ఆదేశించారు.
నిజాంపేట బండారీ లేఔట్‌కు ఆనుకుని ఉన్న తుర్క చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని కమిషనర్ స్థానికులకు తెలిపారు. 43.50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువులోకి చేరుతున్న మురుగునీటిని ముందుగా మళ్లించి, పూడిక తొలగించిన తర్వాత సుందరీకరణ పనులు చేపడతామని చెప్పారు. మురుగునీరు కలవకుండా ఎస్‌టీపీల ఏర్పాటు, చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు, ప్లే ఏరియాలు, పార్కులు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. కూకట్‌పల్లి నుంచి జీడిమెట్ల వెళ్లే ఉషాముల్లపూడి రోడ్డులోని ఎల్లమ్మ కుంట అభివృద్ధికీ సహకరిస్తామని తెలిపారు. చెరువు ఎఫ్‌టీఎల్ హద్దులను నిర్ధారించి వెంటనే పనులు ప్రారంభించాలని, సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు సూచనలు ఇచ్చారు. ప్రగతినగర్ చెరువు పరిసరాల్లో చేపలు, మాంసం దుకాణాల తరలింపును కూడా కమిషనర్ పరిశీలించారు. త్వరలోనే ఈ చెరువు అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని స్థానికులకు భరోసా ఇచ్చారు. చెరువుల అభివృద్ధితో పాటు పార్కులు, రహదారులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నందుకు కాలనీ వాసులు, సంక్షేమ సంఘ ప్రతినిధులు కమిషనర్‌కు మొక్కలు అందజేసి స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.


